వారానికోసారి నీటి సప్లైతో కొత్తగూడెం పట్టణవాసుల తిప్పలు

వారానికోసారి నీటి సప్లైతో కొత్తగూడెం పట్టణవాసుల తిప్పలు
  •     మూడేండ్లైనా పూర్తి కాని రూ.40 కోట్ల స్కీమ్
  •     ఆరు నెలలుగా పెండింగ్​లో రూ.130 కోట్ల ప్రపోజల్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గుక్కెడు నీళ్ల కోసం కొత్తగూడెం వాసులు తిప్పలు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో వారానికోసారి నీటి సరఫరా జరుగుతుండడంతో నీళ్లు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సప్లై సరిగా లేని ప్రాంతాలకు వాటర్​ ట్యాంకర్లను కూడా సరిగా పంపడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ప్రజలకు మెరుగైన నీటి సరఫరా కోసం రూ.130 కోట్లతో పంపిన ప్రపోజల్స్​ అనుమతులకు నోచుకోవడం లేదు. ఇక రూ.40 కోట్లతో చేపట్టిన వాటర్​ స్కీమ్​ వర్క్స్​ మూడేండ్లైనా పూర్తి కాలేదు. సింగరేణి ఇచ్చే అరకొర నీళ్లే కొత్తగూడెం ప్రజలకు దిక్కవుతున్నాయి.  

వేసవికి ముందే దీన పరిస్థితి..

వేసవికి ముందే కొత్తగూడెం పట్టణ ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. తాగు నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఫ్యూరిఫైడ్, మినరల్​ వాటర్​ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలో లక్ష జనాభా, 22 వేలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. అధికార లెక్కల ప్రకారం 9 వేల వరకు నల్లా​కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు 8 మిలియన్​ లీటర్ల నీటి సప్లై చేయాల్సి ఉంది. అయితే కేవలం 4 మిలియన్​ లీటర్ల నీటినే సప్లై చేస్తున్నారు. సింగరేణి సప్లై చేసే నీటితోనే పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు సర్దుకుంటున్నారు. నీటి ఎద్దడి నివారణ కోసం తెలంగాణ మున్సిపల్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్​ ద్వారా ప్రభుత్వం రూ.40 కోట్లను మంజూరు చేసింది. మూడేండ్ల కింద పట్టణ సమీపంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్ట్  నుంచి నీటిని తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న సంప్​లు, పైప్​లైన్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

గిరిజన రైతుకు పరిహారం ఇయ్యలే..

రేగళ్ల ప్రాంతంలో గిరిజన రైతు నుంచి అర ఎకరం భూమిని నీటి ప్రాజెక్ట్​ కోసం మున్సిపల్​అధికారులు తీసుకున్నారు. కొత్తగూడెం పట్టణంలో రెండు గుంటల భూమి, రూ.5 లక్షల పరిహారం, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగం ఇచ్చేలా అధికారులు ఒప్పందం చేసుకున్నారు. పనులు చేస్తూ గిరిజన రైతు విషయం పట్టించుకోకపోవడంతో ఇటీవల పైప్​లైన్​ పనులను అడ్డుకున్నారు. తనకు న్యాయం చేస్తేనే పనులు చేయనిస్తానని స్పష్టం చేయడంతో పనులు నిలిచిపోయాయి. పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీగా ఉన్నా కొర్రీలు పెడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్​ పూర్తయితే కిన్నెరసానితో పాటు సింగరేణి నుంచి వాటర్​ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మిషన్​ భగీరథ నుంచి రోజుకు కేవలం 2.5 మిలియన్​  లీటర్ల నీటిని మాత్రమే మున్సిపాలిటీ తీసుకుంటోంది. పైప్​లైన్లు, ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చినా నీటి సప్లై మాత్రం చేయడం లేదు.

పట్టణంలోని రామవరంలో ఓవర్​హెడ్​ ట్యాంక్​ పనులు పూర్తయ్యాయి. మైనర్​ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే మున్సిపల్​ చైర్ పర్సన్​ ఉంటున్నా పనులు చేయించి నీటి సప్లై చేయించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. పట్టణంలోని బూడిదగడ్డ, కూలీలైన్, గాజుల రాజం బస్తీ, హనుమాన్​ బస్తీ, మధురబస్తీ, రామాటాకీస్​ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో వారానికోసారి నీటి సప్లై చేస్తున్నారు. ఆరు నెలల కింద నీటి ఎద్దడి నివారణ కోసం రూ.130 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలకవర్గం, అధికారులు ప్రకటించారు. ఆ ప్రపోజల్స్​ ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. 

పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్రు

నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీటి సమస్యను పక్కకు పెట్టి సుందరీకరణ, పార్కులకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్రు. వేసవికి ముందే నీటి ఎద్దడి నెలకొంది. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతాం. -వై  శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్

ఫండ్స్​ లేవనడం కరెక్ట్​ కాదు..

నీటి ఎద్దడి తీర్చేందుకు ఫండ్స్​ లేవని ఎమ్మెల్యే, మున్సిపల్​ చైర్ పర్సన్​ ప్రజలను మోసం చేస్తున్నారు. పార్కులు, జిమ్​ల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారు. నీటి సప్లై చేయడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు.  -కోనేరు సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు