కోదాడలో బీఆర్ఎస్ కు షాక్ .. అసమ్మతి  నేతల మూకుమ్మడి రాజీనామా

కోదాడలో బీఆర్ఎస్ కు షాక్ .. అసమ్మతి  నేతల మూకుమ్మడి రాజీనామా
  • నేడు కాంగ్రెస్ లో చేరిక ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయామని వెల్లడి
  • ఆయనపై వ్యతిరేకతతోనే పార్టీ మారుతున్నట్లు ప్రకటన

కోదాడ,వెలుగు : కోదాడలో బీఆర్ఎస్  అసమ్మతి నాయకులుగా ముద్రపడిన వారంతా శనివారం ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే వెన్నేపల్లి చందర్ రావుతో పాటు ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు జడ్పీటీసీలు, బీఆర్ఎస్  రాష్ట్ర కార్యదర్శి యెర్నేని బాబు, పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. వారితో పాటు మరికొందరు నాయకులు కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేయనున్నారు. వారంతా నల్లగొండ ఎంపీ ఉత్తమ్  కుమార్  రెడ్డి సమక్షంలో ఆదివారం కోదాడలో కాంగ్రెస్  పార్టీలో చేరనున్నారు.

తాజా పరిణామంతో కోదాడలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాతూ తామంతా అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో విసుగు చెంది రాజీనామా చేశామన్నారు. ఎమ్మెల్యే నిరంకుశ వైఖరితో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందన్నారు.2018 లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయం మేరకు కోదాడ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లం గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేశామని, ఆయన గెలిచిన నాటి నుంచి పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా చేశారని వాపోయారు.

ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని చేరదీసి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీలు,జడ్పీటీసీలు, సర్పంచులు సింగిల్ విండో చైర్మన్లును వారి పని వారిని చేసుకోనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతూ ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఫైర్  అయ్యారు. కోదాడ అభ్యర్థిని మార్చాలని అధిష్టానం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతోనే తాము పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని చందర్  రావు తెలిపారు.

ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్  కమిటీ మాజీ చైర్మన్  మహబూబ్ జానీ, మోతె ఎంపీపీ ఆశ, అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, నడిగూడెం జడ్పీటీసీ బాణాల కవిత, అనంతగిరి జడ్పీటీసీ ఉమ తదితరులు పాల్గొన్నారు.