- జీరోగా మిగలనున్న ఆప్.. పీడీపీకి కింగ్ మేకర్ చాన్స్
- హర్యానాలో 90 సీట్లకుగాను కాంగ్రెస్కు 50కిపైనే సీట్లు
- పదేండ్ల బీజేపీ పాలనకు తెరపడుతుందన్న పోల్స్
- జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం
- 90 సీట్లకుగాను ఎన్సీ కూటమికి 30-40 సీట్లు
- బీజేపీకి 20-30 సీట్లు వచ్చే అవకాశం
- 8వ తేదీన తేలనున్న ఫలితాలు
- ఎగ్జిట్ పోల్స్ విడుదల
న్యూఢిల్లీ: హర్యానాలో పదేండ్ల బీజేపీ పాలనకు తెరపడనుందని, ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. జమ్మూకాశ్మీర్ లో పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ మార్క్ రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని పోల్స్ అంచనా వేశాయి. హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు శనివారం సాయంత్రం విడుదల చేశాయి. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 46 సీట్లు అవసరం. అయితే, కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 46ను ఈజీగా దాటే అవకాశం ఉందని ఆయా సంస్థలు అంచనా వేశాయి.
బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు పది, పదిహేను సీట్ల దూరంలో ఉండిపోవచ్చని తెలిపాయి. కాంగ్రెస్ కు 50కిపైగా సీట్లు రావచ్చని ఐదు సర్వే సంస్థలు తేల్చాయి. 45కుపైనే సీట్లు వస్తాయని మరో మూడు సంస్థలు వెల్లడించాయి. ఇక జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలోనూ 90 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. అయితే, బీజేపీ కన్నా ఎన్ సీ, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ, ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) వచ్చే చాన్స్ లేదని తేల్చేశాయి. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ 20 నుంచి 30 సీట్లను గెలుచుకోవచ్చని,
ఎన్ సీ (నేషనల్ కాన్ఫరెన్స్), కాంగ్రెస్ కూటమి30 నుంచి 40 సీట్లతో ఆధిక్యంలో ఉండొచ్చని సర్వే సంస్థలు వెల్లడించాయి. పీడీపీ కేవలం 4 నుంచి 8 సీట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నాయి. ఈ నెల 8న రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడతాయి.
మూడోసారీ మా ప్రభుత్వమే
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. గెలిచేది మేమే. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. పదేండ్లలో మేం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు చూశారు. హర్యానాకు ప్రాంతీయవాదం, కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి కల్పించాం. మళ్లీ గెలుస్తామని మా నమ్మకం.
-నాయబ్ సింగ్ సైనీ, హర్యానా సీఎం, బీజేపీ నేత
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా.. హర్యానా(90) మ్యాజిక్ ఫిగర్: 46
సంస్థ పేరు కాంగ్రెస్ బీజేపీ ఐఎన్ఎల్ డీ ఇతరులు
యాక్సిస్ మై ఇండియా 53-65 18-28 1-5 3-8
ఇండియాటుడే-సీవోటర్ 50-58 20-28 0-2 10-14
పీపుల్స్ పల్స్ 49-61 20-32 2-3 3-5
రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ 55-62 18-24 3-6 2-5
జమ్మూకాశ్మీర్ (90) మ్యాజిక్ ఫిగర్: 46
సంస్థ పేరు కాంగ్రెస్ బీజేపీ పీడీపీ ఇతరులు
యాక్సిస్ మై ఇండియా 35-45 24-34 4-6 8-23
పీపుల్స్ పల్స్ 46-50 23-27 7-11 4-6
ఇండియాటుడే-సీవోటర్ 40-48 27-32 6-12 6-11
రిపబ్లిక్-గలిస్తాన్ న్యూస్ 31-36 28-30 5-7 8-16
ప్రజలు రివెంజ్ తీసుకున్నరు
హర్యానా ప్రజలకు ఇది సంతోషకరమైన రోజు. గత పదేండ్ల బీజేపీ పాలనలో వారు ఎన్నో కష్టాలు పడ్డారు. పదేండ్లపాటు అనుభవించిన అణచివేతకు ప్రజలు ఇప్పుడు రివెంజ్ తీసుకున్నారు.
-వినేశ్ ఫొగాట్, కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్
వాళ్లకు ఎగ్జిట్ పోల్స్ లోనే సీట్లొస్తయ్
ఎన్ సీ, కాంగ్రెస్ కూటమికి ఎగ్జిట్ పోల్స్ లో మాత్రమే సీట్లు వస్తాయి. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఒక్క జమ్మూ ప్రాంతంలోనే మాకు 35 సీట్లొస్తయి. మెజార్టీకి కావల్సిన మిగతా సీట్లను కాశ్మీర్ లో గెలుచుకుంటామన్న విశ్వాసం ఉంది.
-కవీందర్ గుప్తా, జమ్మూకాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత
బీజేపీతో పొత్తు ఉండదు
జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోం. ఇక్కడ మాకు పడిన ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకంగా వేసిన ఓట్లు. ముస్లింల ఇండ్లు, షాపులను బుల్డోజర్లతో కూలగొట్టి కష్టాలపాలు చేసిన ఆ పార్టీతో మేం కలిసి వెళ్లం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నుకుంటే అది బీజేపీ నేతల భ్రమే అవుతుంది.
-ఫరూక్ అబ్దుల్లా, ప్రెసిడెంట్, నేషనల్ కాన్ఫరెన్స్
అంచనాలు తప్పుతయ్
జమ్మూకాశ్మీర్ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది 8వ తేదీనే తేలుతుంది. గత లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయి. టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను పట్టించుకోనవసరం లేదు.
-ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత