మీ పేటీఎం బ్లాక్ అయింద‌ని చెప్పి.. రూ.ల‌క్ష‌లు కాజేశారు

మీ పేటీఎం బ్లాక్ అయింద‌ని చెప్పి.. రూ.ల‌క్ష‌లు కాజేశారు

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నా సైబర్‌ నేరగాళ్లు మాత్రం తమ నేరాల‌ను ఆప‌ట్లేదు. ఫోన్ ద్వారా అమాయ‌కుల‌కు మాయ‌మాటలు చెప్పి వారి నుంచి అందిన‌కాడికి దోచేస్తున్నారు. బ్యాంక్‌ ఖాతా యొక్క‌ కేవైసీ వివరాలు చెప్పాలంటూ ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారిని నమ్మించి అతడి ఖాతా నుంచి రూ. లక్షా ఎన‌భై ఐదు వేలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే… పేటియం అకౌంట్ బ్లాక్ అయిందని బ్యాంకు అధికారి పేరుతో… బేగంపేట్ కుందంబాగ్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేశాడు ఓ అప‌రిచిత వ్య‌క్తి. అతని మాటలు నమ్మి తన ఫోన్ కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ కాల్ మాట్లాడిన రెండు గంటల్లో లక్షా 85 వేల నగదు డ్రా చేసినట్లు మెసేజ్ రావ‌డంతో తాను మోస‌పోయాన‌ని ఆ రిటైర్డ్ ఆఫీస‌ర్ గ్ర‌హించాడు. వెంట‌నే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదే తరహాలో సంజీవ రెడ్డి నగర్ కు చెందిన. హరీష్ రాజ్ అనే వ్యక్తి అకౌంట్ నుండి 1,32,000 రూపాయలను, సికింద్రాబాద్ కు చెందిన కాశీనాథ్ అనే మరో వ్యక్తి అకౌంట్ నుండి 1,30,000రూపాయలను సైబర్ నేరగాళ్లు డ్రా చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.