మావోయిస్ట్,బందిపోటులా పోలీసులు అరెస్ట్ చేశారు: ఆకునూరి మురళి

మావోయిస్ట్,బందిపోటులా పోలీసులు అరెస్ట్ చేశారు: ఆకునూరి మురళి

హనుమకొండ జిల్లా :  రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని ఎవరూ మాట్లాడలేని పరిస్థితి కల్పించిందన్నారు. రాష్ట్రంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇండ్లు నిర్మించి ఐదారేళ్లు పూర్తవుతున్నా అర్హులకు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండలోని అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తైనా ఇవ్వకపోవడంతో దాదాపు 300 కుటుంబాలు మురికి కూపాల్లో ఉన్నాయన్నారు. ఇండ్లు లేనివారిని చూస్తే తనకు బాధ వేసిందని, అందుకే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించే వరకూ అక్కడే ఉండాలనిపించిందన్నారు. 

ఉదయం లబ్దిదారులతో మాట్లాడుతామని అక్కడే పడుకున్న తనను మావోయిస్టు, బందిపోటులా పోలీసులు అరెస్ట్ చేశారని ఆకునూరి మురళి ఆరోపించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఫిర్యాదు చేస్తానన్నారు. ప్లాట్లను ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఇండ్లను లబ్దిదారులకు పంచకుండా కలెక్టర్లను ఎమ్మెల్యేలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇండ్లను అర్హులకు అందించాల్సిన అధికారం, బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఉందన్నారు. లబ్దిదారులను మురికి కూపాల్లో ఉంచడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా..? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలనే డిమాండ్ తో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని చెప్పారు. 

అంతకుముందు..ఆకునూరి మురళిని హనుమకొండలో పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు. బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్​ చేస్తూ.. సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ రాష్ట్ర నాయకుడు పృథ్విరాజ్ తో కలిసి ఇవాళ కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఆకునూరి మురళిని అదుపులోకి తీసుకున్నారు.