
జనాలకు వింత వింత కోరికలు కలుగుతున్నాయి. రిటూర్ అయిన కృష్ణా... రామ అని కాలం గడపక వింత ఆలోచనలు చేస్తూ అది చేయండి... ఇదీ చేయండి అంటూ సతాయిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం వారి పనులు మాత్రం వారే చేసుకుంటూ వారి ఆలోచనలను అమలు చేసేందుకు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలానే ఓ రిటైర్ ప్రొఫెసర్ వింత ఆలోచన వచ్చింది. ఆమహానుభావుడి డీఎన్ఏను అంతరిక్షంలోకి పంపాలట.. అక్కడ ఆయన ఏలియన్స్ ను సృష్టించాలంటున్నాడు రిటైర్డ్ ప్రొఫెసర్ కెన్ ఓమ్.
తాము కాకపోతే తమ వారసులైనా జాబిల్లి (DNA to Moon) పై ఇళ్లు కట్టుకుంటారనే దూరాలోచనతో అక్కడ స్థలాలు కొనుగోలు చేసేవారిని చాలా మందినే చూశాం. తాజాగా తన రూపురేఖలతో ఉన్న వ్యక్తిని క్లోనింగ్‌లో ఎప్పటికైనా అక్కడ సృష్టిస్తారనే ఆశతో ఒక 86 ఏళ్ల వ్యక్తి వింత ఆలోచన చేశాడు. ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేసి రిటైర్ అయిన కెన్ ఓమ్ అనే వ్యక్తి తన డీఎన్ఏను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపాలని నిర్ణయించుకున్నాడు. కెన్ ఓమ్ 50 సంవత్సరాలు ప్రొఫెసర్ గా పనిచేశాడు. అతను చంద్రుని ఉపరితలం... అక్కడి వాతావరణం గురించి చాలా పుస్తకాలు రాశాడు.
ఎప్పటికైనా తన క్లోనింగ్‌ను చంద్రునిపై తయారు చేస్తారన్న ఆశ ఉందని ప్రొఫెసర్ ఓమ్ పేర్కొన్నాడు. స్టార్ వార్స్ సినిమాలో రిపబ్లిక్ ఆర్మీని సృష్టించినట్లు గానే తన డీఎన్ఏ నుంచి 1000 వెర్షన్‌లను తయారుచేసే అవకాశముంటుందని అభిప్రాయపడ్డాడు. మంచి బేస్‌బాల్ ఆటగాడిగా జావెలిన్ థ్రో నిపుణిడిగా పేరు తెచ్చుకున్న ఓమ్.. తొలుత నాసా (NASA) లో వ్యోమగామిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అన్ని పరీక్షలూ దాటినప్పటికీ ఎత్తు తగినంత లేకపోవడంతో అది సాధ్యపడలేదు.
తన ఈ చివరి కోరికకు ఆ అసంతృప్తీ ఒక కారణమని ఆయన పేర్కొన్నాడు. ఒక వేళ తాను అనుకుంటున్నట్లు క్లోనింగ్ సాధ్యపడకపోయినా.. మన జాతికి చెందిన ఒక మనిషి డీఎన్ఏ సుదూరాన ఉన్న ఆ చందమామపై ఉందని పిల్లలు చెప్పుకున్నా చాలని వెల్లడించాడు. కాగా ఓమ్ డీఎన్ఏను చంద్రునిపైకి చేర్చే బాధ్యతను టెక్సాస్ కు చెందిన సెలెస్టిస్ అనే సంస్థ తీసుకుంది. భూమి నుంచి వివిధ వస్తువులను తీసుకెళ్లడంలో ఈ సంస్థకు ఎంతో పేరు ఉంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 17 విమానాలను పంపింది.
చంద్రుని ఉపరితలం చేరుకోవడానికి అయ్యే ఖర్చు రూ.10.83 లక్షలు. ఇప్పటికే ఎంతో మంది సాధారణ పౌరులు, వ్యోమగాములు, పలువురు క్రీడాకారులు తమ గుర్తుగా ఉండాలని వారికి చెందిన వస్తువులను సెలస్టియల్ సంస్థ ద్వారా అంతరిక్షంలోకి పంపుకొన్నారు.
ఈ క్రిస్‌మస్ రోజున ( డిసెంబర్ 25) సాయంత్రం కేప్ కార్నివాల్ నుంచి ఈ సంస్థ కు చెందిన రాకెట్ చంద్రుని వద్దకు పయనం కానుంది. ఈ ప్రయాణంలో అది ఓమ్ గుర్తులను, డీఎన్ఏను తీసుకెళుతుంది. అలాగే ఎఫ్‌డీఎన్ఐ బెటాలియన్ చీఫ్ అయిన డానియెల్ కాన్లిస్క్ అనే వ్యక్తి తాను చనిపోయిన తర్వాత.. తన అస్థికలను, ఇప్పటికే మృతి చెందిన తన భార్య అస్థికలను కలిపి అంతరిక్షంలో విడిచిపెట్టాలని సెలెస్టియల్ సంస్థను కోరాడు. ఇప్పుడు అతడికి 76 ఏళ్లు కాగా.. భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు.