టీఎస్​పీఎస్సీ పైసల మెషీన్​.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఫైర్​

టీఎస్​పీఎస్సీ  పైసల మెషీన్​.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఫైర్​
  • పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నరు
  • టీఎస్ పీఎస్సీ.. కేటీఆర్​కు ఏటీఎం: రేవంత్ 
  • నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం: కోదండరాం
  • రూ. 10 లక్షల నుంచి కోటి చొప్పున పేపర్లు అమ్ముకున్నరు: ఆర్ఎస్ ప్రవీణ్
  • రూ.3 లక్షల పరిహారం ఇయ్యాలి: నిరుద్యోగులు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం టీఎస్​పీఎస్సీని పైసల మెషీన్​గా మార్చేసిందని వక్తలు మండిపడ్డారు. పరీక్ష పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నదని ఆరోపించారు. అసలు పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేస్తే సరిపోదని, ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిరుద్యోగుల ఆధ్వర్యంలో టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనపై రౌండ్​టేబుల్​సమావేశం నిర్వహించారు. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్​కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్, నిరుద్యోగులు హాజరయ్యారు. బోర్డు మెంబర్లుగా అనర్హులు: రేవంత్​

గుమస్తా స్థాయి అర్హత లేనోళ్లు గ్రూప్​1 పరీక్షలను ఎట్ల నిర్వహిస్తారని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకే అనర్హులను టీఎస్​పీఎస్సీ బోర్డు మెంబర్లుగా ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. పేపర్ల లీకేజీ జరిగినప్పుడే బోర్డును రద్దు చేసి, అర్హులను నియమిస్తే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మంత్రి కేటీఆర్​కు టీఎస్ పీఎస్సీ, కేసీఆర్​కు కాళేశ్వరం ప్రాజెక్టు, కవితకు సింగరేణి ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు. సీఎంవోలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్​ పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని, వాళ్లను ఎందుకు అరెస్ట్​ చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్.. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. కొట్లాడి తెలంగాణను సాధించుకున్నా, సరైన నాయకుడిని తెచ్చుకోలేకపోయాం. 

ఇకనైనా నిరుద్యోగులు, యువత ఆలోచించాలి. టీఎస్​పీఎస్సీని రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే శాశ్వత పరిష్కారం” అని అన్నారు. ‘‘నిరుద్యోగులు తమ పోరాటంతో కేసీఆర్ ఫామ్​హౌస్​ వదిలి బయటకు వచ్చేలా చేయాలి. రహదారుల దిగ్బంధానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. 14న జాతీయ రహదారులపై బైఠాయిస్తాం. కోదండరాం నేతృత్వంలో తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యమం చేస్తే, భవిష్యత్ తరాలు బాగుపడతాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. 

ఒక్క పరీక్షా సరిగా పెట్టలే: కోదండరాం 

కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగా పెట్టలేదని ప్రొఫెసర్ ​కోదండరాం అన్నారు. సింగరేణి పరీక్ష దగ్గర్నుంచి ఇప్పటివరకు అన్నీ పరీక్షలూ తప్పుల తడకేనన్నారు. పేపర్​ లీకేజీ ఘటనతో అవన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. ‘‘ప్రభుత్వం టీఎస్​పీఎస్సీని పైసలు సంపాదించే మెషీన్​గా మార్చేసింది. కావాల్సిన వాళ్లను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి.. పేపర్లను అమ్ముకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 16 ప్రశ్నపత్రాలు లీకవ్వడమే అందుకు ఉదాహరణ. 2020 వరకు 150 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ తర్వాత ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. ఆ ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం” అని అన్నారు. 

పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని, పరీక్షలను రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే ఆదరాబాదరాగా నిర్వహిస్తోందని విమర్శించారు. ‘‘ఈ ప్రభుత్వం దోచుకోవడానికి ఏర్పా టైంది. దుబాయ్ ఏజెంటుగా కేసీఆర్​ పనిచేశారని అందరూ అంటుంటారు. ఇప్పుడు ఆ ఏజెంట్​గానే పని చేస్తున్నట్టుంది” అని కామెంట్ చేశారు. ‘‘మనం ఎంత అరిచినా అది ప్రభుత్వానికి వినపడదు. ప్రభుత్వం వినాలంటే నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. 14న పెత్తరమాస నాడు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు నివాళిగా మహా రాస్తారోకో చేద్దాం” అని పిలుపునిచ్చారు. 

కేసీఆర్, కేటీఆరే లీకేజీలకు కారణం: ప్రవీణ్ కుమార్ 

పేపర్ల​లీకేజీకి కేసీఆర్, కేటీఆరే ప్రధాన కారణమని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. పరీక్షా పేపర్లు లీక్​చేసి వేల కోట్లకు అమ్ముకుని, 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. గత అక్టోబర్​లో జరిగిన గ్రూప్​-1 ప్రిలిమ్స్​మెరిట్ జాబితా కేటీఆర్ చేతికి ఎలా వచ్చిందో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీపై దర్యాప్తు జరుపుతున్న సిట్​నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఏ విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో.. అదే విద్యార్థులు ఉద్యోగాల కోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సి రావడం దురదృష్టకరం. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్లాక్​మార్కెట్​లో పేపర్లు అమ్ముకున్న దొంగలకు సీఎం వత్తాసు పలకడం సిగ్గుచేటు. టీఎస్​పీఎస్సీ రద్దు అయితే తప్ప.. నిరుద్యోగులకు న్యాయం జరగదు’’ అని అన్నారు.

మాక్కావాల్సింది ఉద్యోగాలు: నిరుద్యోగులు 

గ్రూప్​1 పరీక్ష రాసిన 17 రోజుల తర్వాత 258 ఓఎంఆర్​షీట్లు ఎక్కువ ఎట్ల వచ్చాయని నిరుద్యోగులు ప్రశ్నించారు. హైకోర్టు కూడా కమిషన్​కు ఇదే ప్రశ్న వేసిందని గుర్తు చేశారు. టెక్నికల్ ఎర్రర్ అని టీఎస్​పీఎస్సీ చైర్మన్ నిర్లక్ష్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘ఇప్పటికే మేం ఆర్థికంగా బాగా నష్టపోయాం. మళ్లీ మళ్లీ మోసపోవడానికి మేం సిద్ధంగాలేం. ఇంట్లో వాళ్లు ఫోన్​ చేసి ఇంటికి రమ్మంటున్నరు. ఏదో ఒక పనిచేసుకొమ్మంటున్నరు. పరీక్ష రాసినోళ్లలో చాలా మందికి ఏజ్​ కూడా అయిపోతున్నది. మమ్మల్ని సమాజంలో చేతగానివాళ్లలాగా ప్రభుత్వం చేస్తున్నది. బోర్డుకు సరిగ్గా క్వశ్చన్​ పేపర్లు కూడా తయారు చేయడం రాదు. ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలి. మా వెనక ఏ పార్టీ లేదు. మా అజెండా ఒక్కటే.. ఉద్యోగాలు కావాలి. ఇంటికాడి నుంచి రేషన్​ బియ్యం తెచ్చుకుని చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నాం’’ అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.