
- బిల్లుల ఆమోదానికి రాహుల్, ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
- ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర
- మతం కాదు.. వెనుకబాటుతనం ఆధారంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లు
- ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి అవగాహన లేదు
- భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నం
- గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎప్పట్నుంచో ముస్లిం రిజర్వేషన్లు
- దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ఎత్తివేయాలని బీజేపీ నేతలకు సవాల్
- స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై పరిశీలిస్తున్నామని వెల్లడి
- దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ బిల్లుల ఆమోదానికి లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అవసరమైతే ఇండియా కూటమి నేతలను కలిసి మద్దతు కూడగడుతామని తెలిపారు. ‘‘వ్యవసాయ చట్టాల విషయంలో తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వంతోనే రైతులకు క్షమాపణ చెప్పించాం. దేశవ్యాప్త జనగణనలో కులగణన చేపట్టేలా చేశాం.
తొలుత ససేమిరా అనడం... తర్వాత పారిపోవడం బీజేపీ సహజ లక్షణం”అని విమర్శించారు. 2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన తెలిపారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబర్ నెలాఖరులోగా) స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో (జులై నెలాఖరులోగా) రిజ ర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని సీరియస్‌గానే పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే, బీసీ బిల్లులను ఎలా సాధించుకోవాలనే దానిపై తమకు వ్యూహం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
3 శాతం మంది ఏ కులం లేదన్నరు..
రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘సర్వే ప్రకారం రాష్ట్రంలో 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వర్గాల వారు ఉన్నారు.
తమకు ఏ కులం లేదని 3.09 శాతం మంది ప్రకటించారు. తెలంగాణలో ఇదో కొత్త ఒరవడి. సర్వే నివేదికను నిపుణుల కమిటీకి అందజేయగా, వాళ్లు దానిపై చర్చించి సలహాలు, సూచనలు ఇచ్చారు. కమిటీ నివేదికను మంత్రివర్గంలో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడతాం”అని చెప్పారు. ‘‘కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచింది. సర్వే కోసం బెస్ట్ అండ్ లేటెస్ట్ విధానాన్ని అమలు చేశాం. దేశవ్యాప్తంగా చేపట్టే కులగణనకు తెలంగాణను మించిన మోడల్ లేదు. ఈ విషయంలో ప్రధాని మోదీ రోడ్‌మ్యాప్ వేస్తే, నేను టార్చ్ లైట్‌గా సహకరిస్తాను”అని అన్నారు.
బీఆర్ఎస్‌కు నాయకుడు లేడు..
రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు నాయకుడు లేరని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయనకు ఇంట్లోనే కోతుల కొట్లాట ఉందని.. కేటీఆర్, కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుల పెద్దనో, కుటుంబంలోని వ్యక్తో కూర్చొని మాట్లాడితే వారి సమస్య పరిష్కారమవుతుందని.. కానీ ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకే ఇంట్ల పంచాయితీ పెడుతున్నారని అన్నారు. 2008లో హరీశ్‌రావు ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డిని కలిశారని, ఆ తర్వాత కుల పెద్దలతో చర్చలో అంత సవ్యంగా మారిందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపారని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘వాళ్లొక పిచ్చోళ్లు. వారికి ఏ అవగాహన లేదు. ఏ బిల్లు పంపినా రాష్ట్రపతి, గవర్నర్లు క్లారిఫికేషన్ కోరతారు. ఈ విషయంలో గవర్నర్ ఆఫీస్ అడిగితే ఏనాడో రిప్లై ఇచ్చాం”అని స్పష్టం చేశారు.
ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు కారణాలేమిటో తనకు తెలియదని, కానీ ఆ రాజీనామా దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్రపతి పదవిని ఈ దఫా తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారు. కేంద్రమంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్‌గా పంపి, ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారు. బీసీ నేత బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి, ఆ తర్వాత రాంచందర్‌రావుకు ఇచ్చారు. ఇలా బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయింది. తెలంగాణ నుంచి ఎదుగుతున్న బీసీ నేతలను అణచివేస్తూ, ఈ ప్రాంతం నుంచి బీసీలు ఎదగకుండా బీజేపీ చేస్తున్నది.
బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుంది” అని అభిప్రాయపడ్డారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ దేనని చెప్పారు. తనకు అవకాశం ఉంటే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తానన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ రావు, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర..
ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయి. కానీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముస్లింలను సాకుగా చూపుతున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలి. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇక ముందూ అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
అందుకు బీజేపీ నేతలు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎగిరిపోయింది. పార్లమెంట్‌లో చట్టమే తెస్తే, కోర్టులు ఎలా ఆపగలవు? కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించకపోతే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది”అని హెచ్చరించారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కంప్లయింట్‌తోనే ఫోన్ ట్యాపింగ్ కేసు..
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంప్లయింట్‌తోనే ఫోన్ ట్యాపింగ్ కేసు బహిర్గతమైందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేగానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని చెప్పారు. ‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, ఎలక్షన్ కమిషన్ దీనిపై రాష్ట్ర డీజీపీని వివరణ కోరింది. ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఎస్ఐబీలో కొన్ని ఎక్విప్మెంట్లు మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైంది. ఆ తీగ లాగితే చివరకు ఈ కేసు బయటకు వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ చేయడం లీగల్. కానీ దానికి ఒక విధానం ఉంటుంది. అవేమీ పాటించకుండా నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్‌కు పాల్పడింది”అని మండిపడ్డారు. చివరకు సొంత ఫ్యామిలీ మెంబర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని, అలాంటోళ్లు సూసైడ్ చేసుకోవడం మంచిదని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టలేదని, ఒకే సర్వే నెంబర్ పేరుతో 2,500 ఎకరాల భూమి ఉందని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను సుప్రీంకోర్టు అడ్వైజ్ మాత్రమే చేయొచ్చని, ఆర్డర్ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులో ఇప్పటికే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అంశంపై చర్చ జరుగుతున్నదని గుర్తుచేశారు.
మా ప్రభుత్వం తెచ్చిన రెండు బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను కలుస్తాం. వీళ్లిద్దరినీ గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే గురించి వివరిస్తాం. అలాగే సాయంత్రం కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఇందిరా భవన్‌లో పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సర్వే కోసం అనుసరించిన విధానాలను వివరిస్తాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లుల ఆమోదానికి పట్టుబడతాం. సీఎం రేవంత్