కాంగ్రెస్ గెలిస్తే.. ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష నగదు, తులం బంగారం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ గెలిస్తే.. ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష నగదు, తులం బంగారం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి రూ.లక్ష నగదు తోపాటు తులం బంగారం కూడా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2023, నవంబర్ 16వ తేదీ గురువారం మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం తరలించలేదన్నారు.

జవహర్ నగర్ కు కేసీఆర్ ఇచ్చింది డంపింగ్ యార్డ్ మాత్రమేనని.. మెడ్చల్ కు తెస్తామన్న ఐటీ పార్క్ ఎక్కడికి పోయిందని విమర్శించారు.  కేసీఆర్, మల్లారెడ్డిలు కలిసి మేడ్చల్ లో భూములను కబ్జా చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2వేల 5 వందలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఉండేదని.. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి దానిని 12 వందల రూపాయలు చేశారని అన్నారు.

 కాంగ్రెస్ ను గెలిపిస్తే.. ఉచితంగా 24 గంటల కరెంటు, ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు యువవికాసం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. వృద్ధులకు ప్రతి నెల రూ.4వేల పించన్ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.