కరెంట్ బిల్లులు కట్టొద్దు.. డిసెంబర్ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే:రేవంత్ రెడ్డి

కరెంట్ బిల్లులు కట్టొద్దు..  డిసెంబర్ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే:రేవంత్ రెడ్డి

గద్వాల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనన్నారు టీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి.  గద్వాల ప్రజాగర్జన సభలో మాట్లాడిన రేవంత్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లూ నిరూపిస్తే తాము నామినేషన్ వెయ్యబోమన్నారు.  8 గంటలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేదని తాము నిరూపిస్తే గద్వాలలో ముక్కు నేలకు రాయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.   కాంగ్రెస్ మీద కేసీఆర్ బురద జల్లుతున్నారని విమర్శించారు. 

10 ఏండ్లలో బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెప్పారు.  కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని.. డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.   200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లులు  ప్రభుత్వం చెల్లిస్తదన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు  రెండు వేలు ఇస్తామని చెప్పారు.

ఎస్టీ జాబితాలో బోయల్ని చేర్చాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రేవంత్ రెడ్డి.   గద్వాలను బీఆర్ఎస్  సర్కార్   పట్టించుకోలేదన్నారు.  వయసు మీద పడ్డా కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.  ధరణి ద్వారా కేసీఆర్ భూకబ్జాలకు పాల్పడ్డారని..  పోడుభూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే   ధరణి రద్దు చేసి మంచి వెబ్ సైట్ తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తామన్నారు రేవంత్. అంతేగాకుండా కౌలురైతులకు కూడా 15 వేలిస్తామని చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read :-ఓటే వజ్రాయుధం.. బాగా ఆలోచించి వేయండి: కేసీఆర్