హైదరాబాద్, వెలుగు: కేటీఆర్‌కు తెలంగాణతో అసలు సంబంధమే లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేటీఆర్వన్నీ ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నవే. తెలంగాణతో పేగు బంధం, పేరు బంధమేదీ ఆయనకు లేదు. ఒక్క కేసీఆర్ కుమారుడు అన్న హోదాలో ఆయన అన్ని పదవులను అనుభవిస్తున్నడు. కేటీఆర్ పేరు ఆంధ్రా వ్యక్తి నుంచి అరువుతెచ్చుకున్నది.. ఆయన చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో. ఆ తర్వాత అమెరికాకు పోయి ఉద్యోగం చేసిండు. అట్లాంటప్పుడు కేటీఆర్‌కు తెలంగాణతో ఉన్న పేగుబంధమేంది?” అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయుంటే వీళ్లంతా నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవాళ్లు అని కేటీఆర్‌ను విమర్శించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని చంపేస్తామంటూ కర్ణాటకలోని చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ నరేంద్ర రాథోడ్ బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు.
‘‘త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ కాళ్లకు కేటీఆర్ మొక్కితే కనీసం పాపాలైనా పోతయ్. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఉక్కుపాతరేస్తరు. గాడ్సే పార్టీ ప్రతినిధులతో అంటకాగింది కేసీఆర్, కేటీఆరే. ఓ ర్యాలీలో గాడ్సే ఫొటోను ప్రదర్శించిన వాళ్లపై చర్యలు తీసుకోని వ్యక్తి.. ప్రియాంక గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏం నేర్చుకోవాలని రేవంత్ ప్రశ్నించారు. ‘‘3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులను స్టడీ చేయాల్నా? పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వని సర్కారు అసమర్థతను, రైతుల గోసను స్టడీ చేయాల్నా? ఇంటర్ పరీక్ష పత్రాలను సరిగ్గా దిద్దకపోవడంతో 25 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నరు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకై నిరుద్యోగులు నష్టపోయిన్రు. వాటిని స్టడీ చేయాల్నా? మీ సర్కారు నుంచి నేర్చుకోవాల్సింది ఏంది?” అని కేటీఆర్‌ను నిలదీశారు. ప్రియాంకా గాంధీ కాళ్లకు మొక్కి క్షమాపణలు అడగాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
ఖర్గే ఫ్యామిలీని చంపేందుకు కుట్ర
ఈ నెల 10న కర్నాటక ప్రజలు అద్భుతమైన తీర్పును వెల్లడించబోతున్నారని, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఖర్గే నాయకత్వంలోని పార్టీ శ్రేణులు అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కర్నాటకలో ఖర్గే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారని, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్ చెప్పారు. కానీ, వారిని ఎదుర్కోలేక బీజేపీ అభ్యర్థి మణికంఠ నరేంద్ర రాథోడ్ ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మణికంఠ నరేంద్ర రాథోడ్‌పై ఎన్నో క్రిమినల్ కేసులున్నాయని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతూ ఫిర్యాదు చేశామని రేవంత్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో రేవంత్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.