కేసీఆర్​ ఫ్యామిలీది ఆర్థిక ఉగ్రవాదం.. వాళ్ల ధనదాహానికి కాళేశ్వరం బలైంది: రేవంత్ రెడ్డి

కేసీఆర్​ ఫ్యామిలీది ఆర్థిక ఉగ్రవాదం.. వాళ్ల ధనదాహానికి కాళేశ్వరం బలైంది: రేవంత్ రెడ్డి
  • మేడిగడ్డ కుంగి కేసీఆర్​ పాపం పండింది
  • రీడిజైన్​ పేరుతో ప్రాజెక్టుల స్వరూపాన్నే మార్చేసిండు
  • రూ.38 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు అంచనాలు పెంచిండు
  • సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు ఆదేశిస్తలే?
  • మేడిగడ్డ ప్రాజెక్టును ప్రధాని మోదీ పరిశీలించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్​ హయాంలో చేపట్టినవేనని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. రీడిజైన్​ పేరుతో ప్రాజెక్టుల స్వరూపాన్నే కేసీఆర్​ మార్చేశారని, లక్ష కోట్లు దోచుకున్నారని ఆయన ఫైర్​ అయ్యారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్​ మేనేజ్​మెంట్​ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీని ఓ పద్ధతి ప్రకారం డిజైన్​ చేయలేదని, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదని, నిర్మాణానికి తగ్గట్టు నిర్వహణ లేదని మండిపడ్డారు. కేసీఆర్​ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందన్నారు. మేడిగడ్డ కుంగి కేసీఆర్​ పాపం పండిందని విమర్శించారు.  కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక ఉగ్రవాదులని, వాళ్లది ఆర్థిక ఉగ్రవాదమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. శనివారం గాంధీభవన్​లో మీడియాతో రేవంత్​ మాట్లాడారు. ‘‘తన మేధస్సుతోనే కాళేశ్వరాన్ని నిర్మించానని ఎన్నో సార్లు చెప్పిన కేసీఆర్​.. ఇప్పుడు దాన్ని చిన్నదిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నడు.  నిర్మాణంలో నాణ్యతను పాటించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇంత జరుగుతున్నా దానిపై కేసీఆర్​ దానిపై నోరు మెదపడం లేదు” అని అన్నారు. 

అంచనాలను అమాంతం పెంచిండు

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాలను కేసీఆర్​ ప్రభుత్వం అమాంతం పెంచేసిందని రేవంత్​ విమర్శించారు. ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు రూ.38,500 కోట్లుగా చెప్పిన ప్రభుత్వం.. టెండర్ల నాటికి రూ.80 వేల కోట్లకు పెంచిందని అన్నారు. ఆ తర్వాత రివైజ్డ్​ ఎస్టిమేట్స్​లో రూ.1.51 లక్షల కోట్లుగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని,  కమీషన్లను దండుకునేందుకు కేసీఆర్​ ఓ ప్రణాళిక ప్రకారం ఇట్ల అంచనాలను పెం చారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, పెట్టిన ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.  

కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలే?

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,  దానిపై సీబీఐ విచారణను ఎందుకు జరిపించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ‘‘బీజేపీకి బీఆర్​ఎస్​ ప్రొటెక్షన్​ మనీ ఇస్తున్నది. అందుకే బీఆర్​ఎస్​, కేసీఆర్​ను బీజేపీ కాపాడుతున్నది” అని ఆరోపించారు. సంబంధిత కంపెనీపై విచారణ జరిపించాలని కేసీఆర్​ ఎందుకు అనడం లేదని ఆయన నిలదీశారు. టెక్నికల్​ కమిటీని వేసి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు.

కేంద్రం వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల అధికారులు, నిపుణులతో ఓ టెక్నికల్​ కమిటీని వేయాలని ఆయన అన్నారు.  సిట్టింగ్​ జడ్జి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ కమిటీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్​, అప్పటి ఇరిగేషన్​ శాఖ మంత్రి హరీశ్​ రావుపై చర్యలు తీసుకుని, పదవుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పందించాలని ఆయన అన్నారు.

మేడిగడ్డను ప్రధాని మోదీ చూడాలి

ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారని, కానీ, ప్రాజెక్టులను మాత్రం పరిశీలించడం లేదని రేవంత్​ విమర్శించారు. ఈ పర్యటనలో మేడిగడ్డను మోదీ పరిశీలించాలన్నారు. ‘‘అవినీతి వాసన పడదంటున్న మోదీ.. కేసీఆర్​ అవినీతి కంపును ఎట్ల భరిస్తున్నరు” అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై విచారణ చేపట్టాలని ఓ ప్రతిపక్షంగా కోరుతున్నామని, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అప్పుడు చెప్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాక సంజయ్​ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు.

కోదండరాంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జనం సహించరు

కాంగ్రెస్​కు మద్దతిచ్చే వాళ్లంతా తెలంగాణ వ్యతిరేకులనడం ఏందని బీఆర్​ఎస్​పై రేవంత్​ ఫైర్​ అయ్యారు. కోదండరాం కూడా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకి అయ్యారా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందే కోదండరాం అని, నాడు టీజేఏసీని ఏర్పాటు చేశారని అన్నారు. కోదండరాం గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనమే చెప్పులతో మొహం మీద కొడతారని హెచ్చరించారు. ఇప్పటికే జనం బీఆర్​ఎస్​ నేతలను చెప్పులతో కొడుతున్నారని అన్నారు. బీఆర్​ఎస్​ నేతలకు ఇంకా సిగ్గు రాకుంటే ఎట్ల అని ప్రశ్నించారు.