రాహుల్ పాదయాత్ర విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

రాహుల్ పాదయాత్ర విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు. ఈ నెల 7న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. 

మక్తల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం రాహుల్కు అండగా ఉందని రేవంత్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించినా.. దాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేశారని చెప్పారు. ఈ నెల 5,6 తేదీల్లో మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందని, 7న భారీ బహిరంగ సభతో వీడ్కోలు సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రానందున వారంతా ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పారు. 7వ తేదీ రాత్రి దెగ్లూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెడుతుందని రేవంత్ ప్రకటించారు.