ఫాంహౌస్ కు రోడ్డేస్కోని పేదల ఇండ్లు ముంచిండు : రేవంత్ రెడ్డి

ఫాంహౌస్ కు రోడ్డేస్కోని పేదల ఇండ్లు ముంచిండు : రేవంత్ రెడ్డి

తన ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అడ్డుగా ఉన్న నిరుపేదల ఇళ్లను కూల్చి వేయించడం దారుణమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ లో కుమ్మరి ఎల్లవ్వ అనే మహిళకు కట్టిన తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ప్రజలను తాము అడుగుతామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన చోట బీఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు అవుతాయని, అలా జరగకపోతే మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ ఇద్దరు గుండు కొట్టించుకుంటారంటూ సవాల్ విశారు. ఈ సవాలుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. ఇంటింటికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు 2 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.