
మేడ్చల్ జిల్లా (జవహర్ నగర్) : టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచే టీఆర్ఎస్ పతన ఘట్టాన్ని ప్రారంభించానని ఆయన పేర్కొన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు.రాష్ట్రంలో తెరాస నాయకులు కోట్ల రూపాయలను దోచుకుంటూ మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలో జవహర్ నగర్ కు వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి వెళ్లారని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. జవహర్ నగర్ లో వృథాగా మిగిలిన రాజీవ్ స్వగృహ భవన సముదాలను గాలికొదిలేశారని, జీవో 58, 59లతో ఇప్పటి వరకు ఒక్క పేదోడి ఇంటిని కూడా క్రమబద్ధీకరించలేదని చెప్పారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని.. ప్రభుత్వ భూముల కబ్జాలతో అక్రమ సంపాదనకు టీఆర్ఎస్ నేతలు తెగబడ్డారని విమర్శించారు. జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి సొంత ఆసుపత్రిని నిర్మించుకొని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. పదుల సంఖ్యలో కళాశాలలు నడిపిస్తున్న మల్లారెడ్డి గతంలో ఎంపీగా, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పరిసర ప్రాంత చెరువులు, భూగర్భజలాలు కలుషితమైనా శాశ్వత పరిష్కారాన్ని చూపలేదన్నారు. ఈసందర్భంగా జవహర్ నగర్ కు చెందిన సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, జిల్లా నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోగుల సరిత, జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.