సీఎం కేసీఆర్‭కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‭కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‭కు బహిరంగ లేఖ రాశారు. పోలీసు రిక్రూట్ మంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఆయన లేఖలో వివరించారు. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. ఉద్యోగాలు వస్తాయని విశ్వసించిన యువతకు మీ పాలనలో మొండిచేయి చూపించారని మండిపడ్డారు. ఇదిగో నోటిఫికేషన్లు, అదిగో నోటిఫికేషన్లు అని ఊరించడం తప్ప ఉద్యోగాలు భర్తీ చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆగష్టు.. 2022లో నిర్వహించి ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలతో నిరుద్యోగులు కొంత ఉరట చెందారన్నారు. ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకుని ప్రిలిమినరీ పరీక్ష రాశారని.. నోటిఫికేషన్ జారీ సమయంలో ప్రాథమిక పరీక్షలో అందరికీ 60 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారని చెప్పుకొచ్చారు. పరీక్ష ముగిసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 20 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించారని అయితే... ఈడ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులను మాత్రం నిర్ణయించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

అసలు ఈడబ్ల్యూఎస్ కోటానే పరిగణనలోకి తీసుకోలేదని రేవంత్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం చూసినా ఇది అన్యాయం అని అన్నారు. ఈ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల.. సుమారు 15వేల మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులు తమ సర్టిపికేట్లతో ఫిజికల్ టెస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి నవంబర్ 10 చివరి తేదీ అని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నష్టపోతున్న అభ్యర్థులు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరారని ఆయన చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదమూ లేదన్నారు. పైగా సుప్రీం కోర్టు తాజా తీర్పుకు అనుగుణంగా నిర్ణయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ పేర్కొన్నారు. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో.. ఈడ్ల్యూఎస్ కోటాను నిర్ణయించి తక్షణం ఉత్తర్వ్యూలు జారీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.