26/11 దాడులకు ప్రతీకారం.. ముంబై దాడి సూత్రధారిని మట్టుపెట్టిన భారత సైన్యం

26/11  దాడులకు ప్రతీకారం.. ముంబై దాడి సూత్రధారిని మట్టుపెట్టిన భారత సైన్యం

= కాందహార్‌ హైజాక్‌  సూత్రధారి యూసఫ్‌ కూడా హతం
= ఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన ఎయిర్ ఫోర్స్
=ఈ నెల 7న మురిద్కే, బహవల్‌పూర్‌ లో దాడులు
= అబు అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ చీప్‌ మునీర్‌ హాజరు

ఢిల్లీ: 26/11 దాడులకు ఆపరేషన్ సిందూర్ లో భారత్  ప్రతీకారం తీర్చుకుంది. భారత వాయుసేన చేసిన ఈ నెల  7వ తేదీన 9 ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా దాడులు చేసిన వారి వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు నవంబర్ 26, 2008 న ముంబైలో దాడులకు దిగారు. నాలుగు రోజుల పాటు భారత ఆర్థిక రాజధాని ముంబైపై  ఉగ్రదాడి కొనసాగింది. 

ఈ ఘటన166 మంది మరణానికి దారితీసింది. 300 మందికి పైగా గాయపడ్డారు. ముంబై దాడుల్లో పాల్గొన్న పది మంది తీవ్రవాదుల్లో అజ్మల్ కసబ్‌ను మాత్రమే పోలీసులు ప్రాణాలతో పట్టుకోగలిగారు. అతన్ని 2012 నవంబర్ 21న పుణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు కీలక సూత్రధారిని ఆపరేషన్ సిందూర్ లో  భాగంగా భారత  సేనలు మట్టుబెట్టాయి. 

►ALSO READ | భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి

ఈ దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన అబు జిందాల్ మురిద్కే స్థావరంపై జరిపిన దాడిలో హతమయ్యాడు. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హాజరు కావడం గమనార్హం. మొత్తం ఐదుగురు టాప్ ఉగ్రవాదులను భారత సేనలు హతమార్చాయి. మృతుల్లో ముగ్గురు జైషే మహమ్మద్, ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు. వీళ్లంతా మురిద్కే, బహవల్‌పూర్‌లో జరిగిన దాడిలోనే హతమయ్యారు.  

జైషీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ బావమరిది హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌ హతమయ్యాడు. వీరితో పాటు కాందహార్ హైజాక్ లో కీలక సూత్రధారిగా ఉన్న యూసుఫ్ అజార్ సైతం హతమయ్యాడు.