హక్కులు కల్పించి.. హద్దులు మరిచారు

హక్కులు కల్పించి.. హద్దులు మరిచారు
  • ఒకే సర్వే నంబరులో రెవెన్యూ, ఫారెస్ట్ భూములు
  • రెండేండ్ల కింద మూడు శాఖలతో కమిటీ ఏర్పాటు 
  • నేటికీ భూములకు హద్దులు ఖరారు చేయలే

జగిత్యాల, వెలుగు: శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్, రత్నాపూర్ గ్రామాల రైతులు తమకు కేటాయించిన భూములకు హద్దుల ఏర్పాటు కోసం ఏళ్లుగా పోరాడుతున్నారు. భూములు కోల్పోయిన వారికి మల్లాపూర్ శివారులో 460.14 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఫారెస్ట్‌‌‌‌, ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ మేరకు నాటి కలెక్టర్ యాస్మిన్ భాషా మూడు శాఖలతో కమిటీ ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా హద్దులు ఏర్పాటు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. పరిహారంగా భూములు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడం రైతుల్లో ఆవేదన రేపుతోంది.

వ్యవసాయం కోసం 94 ఎకరాల కేటాయింపు

ఎస్సారెస్పీ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన రత్నాపూర్, కుస్తాపూర్ గ్రామాల భూ నిర్వాసితులకు మల్లాపూర్ శివారులోని సర్వే నంబర్ 1040లో భూములు కేటాయించారు. ఈ సర్వే నంబరులో మొత్తం 460.14 ఎకరాల భూమి ఉండగా, అందులో 180 ఎకరాలు ఫారెస్ట్ భూమి, 280.14 ఎకరాలు రెవెన్యూ భూమిగా గుర్తించారు. రెవెన్యూ భూమిలో 94 ఎకరాలను 45 మంది భూ నిర్వాసితులకు కేటాయించారు. 

వారిలో 22 మంది రైతులకు పట్టా పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు, మిగతా 23 మందికి డీ-1 పట్టాలు ఇచ్చారు. ఒకే సర్వే నంబరులో రెవెన్యూ, ఫారెస్ట్ భూములు కలిసి ఉండడం వల్ల సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా ఆరేళ్లుగా హద్దులు నిర్ణయించాలని ఆఫీసర్లను చుట్టూ తిరుగుతున్నారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. 

మూడు శాఖలతో కమిటీ ఏర్పాటు

భూ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి 2023లో నాటి కలెక్టర్ యాస్మిన్ బాషా ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, మెట్‌‌‌‌పల్లి ఆర్డీవో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. మూడు శాఖలు జాయింట్‌‌‌‌గా సర్వే చేసి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లు గడిచినా హద్దులు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏండ్లు గడుస్తున్న  సమస్య పరిష్కారం కాలే..

 మా చిన్నతనంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద మా ఇండ్లు, భూములు కోల్పోయినం. దానికి బదులుగా మల్లాపూర్ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 1040లో నాకు రెండు ఎకరాలు వచ్చింది. కానీ అధికారులు ఇప్పటివరకు హద్దులు ఏర్పాటు చేయలేదు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలె.- ఎర్ర రాజేశ్వర్, నిర్వాసిత రైతు, కుస్తాపూర్‌‌‌‌‌‌‌‌ 

జాయింట్  సర్వే పెండింగ్‌‌‌‌లో ఉంది

మల్లాపూర్ గ్రామ సర్వే నంబర్1040 లో రెవెన్యూ, ఫారెస్ట్ భూములు కలిసి ఉన్నాయి. హద్దులు నిర్ణయించేందుకు మూడు శాఖల జాయింట్‌‌‌‌ సర్వేకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం సర్వేయర్లు లేకపోవడంతో సర్వే పెండింగ్‌‌‌‌లో ఉంది. ప్రభుత్వం సర్వేయర్లను నియమించిన వెంటనే సర్వే చేస్తాం. గుగ్గిళ్ల రమేశ్‌‌‌‌, మల్లాపూర్ తహసీల్దార్‌‌‌‌‌‌