అద్దె బిల్డింగుల్లో సర్కార్​ ఆఫీసులు

అద్దె బిల్డింగుల్లో సర్కార్​ ఆఫీసులు
  • ఇటీవల భారీ వర్షాలకు ఉరిసిన ఆఫీసులు 
  • అసౌకర్యాల మధ్య డ్యూటీలు చేస్తున్న సిబ్బంది 
  • సకాలంలో మంజూరు కాని కిరాయి బిల్లులు

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాలు, రెవెన్యూ డివిజన్లలో కొన్ని ఆఫీసులకు సొంత బిల్డింగులు లేవు. మండలాలు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఇంకా కిరాయి బిల్డింగ్ ల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి శంకుస్థాపనలు చేసి వదిలేయగా, మరికొన్నింటికి జాగాలే దొరకట్లే. ఆఫీసుల అద్దెలకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. కొత్త బిల్డింగ్స్ నిర్మాణంపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాత మండలాల్లో రెండు, మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన బిల్డింగ్స్ ఇప్పుడు శిథిలావస్థకు చేరి స్లాబ్ లకు పెచ్చులూడడంతోపాటు వానలు పడ్డప్పుడు ఉరుస్తున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో 9 కొత్త మండలాలు.. 

జిల్లాలో విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో 9 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగిరి, కరీంనగర్​ జిల్లాలో గన్నేరువరం, ఇల్లందకుంట, రాజన్నసిరిసిల్లలో వీర్నపల్లి, జగిత్యాలలో జగిత్యాల రూరల్, బుగ్గారం, బీర్పూర్​ మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మండల కేంద్రాల్లో మండల ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎంపీడీఓ, ఎంఈఓ ఇతర ఆఫీసులు చాలా వరకు కిరాయి భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రామగిరిలో పోలీసు స్టేషన్ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని భూమి పూజ చేయగా, ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఆ జాగను ప్రస్తుతం హరితహారం కింద మొక్కలు పెంచడానికి కేటాయించినట్లు తెలిసింది. కొన్ని ఆఫీసులకు శంకుస్థాపన జరిగినా, పనులు మొదలు కాలేదు.

అద్దె భవనాల్లో సౌకర్యాలేవి..

కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసులన్నీ అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కొన్నింటిని మిల్లులు, గోడౌన్లలో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంగా ఏర్పడి ఐదేళ్లు దాటినా పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీసు స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోని భవనాల్లో నిర్వహిస్తున్నారు. గన్నేరువరం తహసీల్దార్ ఆఫీసు అద్దె భవనంలో కొనసాగుతుండగా, పోలీస్ స్టేషన్ ఆయుర్వేద హాస్పిటల్ బిల్డింగ్​లో నడుస్తోంది. ఇక్కడి ఎంపీడీఓ ఆఫీసుకు రెంట్ చెల్లించడం లేదని ఓనర్ తాళం వేయడంతో ప్రభుత్వ హాస్టల్ బిల్డింగ్ కు మార్చారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి తహసీల్దార్​ ఆఫీసు ఊరికి దూరంగా ఉన్న ఓ రైసు మిల్లులో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేక ప్రజలు తిప్పలు పడుతున్నారు. రామగిరి తహసీల్దార్ ఆఫీసును సింగరేణి క్వార్టర్ లో నిర్వహిస్తున్నారు. 

ఈ క్వార్టర్స్​ ఇరుగ్గా ఉండడంతో అధికారులు పనులపై వచ్చే వారిని బయటనే ఉండమంటున్నారు. రామగిరి మండలంలోని పోలీస్​ స్టేషన్​, ఎంపీడీవో, ఎంఈవో, ఏవో ఆఫీసులన్నీ సింగరేణి క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్లలో ఆఫీసులు ఏర్పాటు చేయడంతో కార్మికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీటీసీపీ ఆఫీస్​రెంట్ చెల్లించలేదని ఈ నెల 6న ఇంటి ఓనర్​తాళం వేశాడు. దీంతో స్టాఫ్ స్థానిక జడ్పీ ఆవరణలోని సుడా ఆఫీస్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.   

రెంట్ కట్టడం లేదని తాళం వేశారు.. 

ఇల్లందకుంట మండలంగా ఏర్పడి ఐదేళ్లయినా ఎంపీడీఓ ఆఫీసు అద్దె భవనంలో కొనసాగుతోంది. నెలల తరబడి రెంట్ చెల్లించకపోవడంతో బిల్డింగ్ ఓనర్ ఏప్రిల్ లో తాళం వేశారు. దీంతో అధికారులు ఎంఆర్సీ బిల్డింగ్ కు తరలిస్తామని, అప్పటివరకు ఉండేందుకు అవకాశమివ్వాలని ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు. 

శిథిలావస్థలో ఆఫీసులు.. 

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్,  పంచాయతీరాజ్ ఆఫీసులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు ఉరవడం, పెచ్చులు ఊడిపడుతుండడంతో సిబ్బంది హెల్మెట్లు పెట్టుకుని డ్యూటీ చేయాల్సి వచ్చింది. అలాగే లోపల ఉరవడంతో ఎక్కడికక్కడ గోడలు తేమగా మారి కరెంట్ షాక్ కొట్టడంతో ఉద్యోగులు భయంభయంగా గడపాల్సి వస్తోంది. ఇటీవల ఆఫీసు ఆవరణను వరద ముంచెత్తితింది.