సగానికి పైగా తగ్గిన గుళ్ల అమ్దానీ

V6 Velugu Posted on Jul 19, 2021

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాలపై కొవిడ్ ఎఫెక్ట్​ పడింది. కరోనా భయంతో భక్తులు టెంపుల్స్​కు రావడం చాలావరకు తగ్గించారు. వేములవాడ, యాదాద్రి, బాసర, కొమురవెల్లి లాంటి పెద్ద దేవస్థానాలకు అడపాదడపా వెళ్తున్నప్పటికీ చిన్నచిన్న టెంపుల్స్ వైపు రావట్లేదు. దీంతో ఆయా ఆలయాల ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది. ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకపోయినా దేవాలయ రిపేర్లు, వేడుకలు, ఉత్సవాలు, ఇతరత్రా ఖర్చులకు కష్టమవుతోందని నిర్వాహకులు అంటున్నారు. 

చిన్న ఆలయాలకే కష్టాలు 

ఆదాయం ఆధారంగా టెంపుల్స్​ను ప్రభుత్వం మూడు రకాలుగా విభజించింది. ఏటా కోటి రూపాయలు ఇన్​కం  దాటిన ఆలయాలను 6 ‘ఏ’ కేటగిరీలో, 25 లక్షల నుంచి కోటిలోపు వచ్చే ఆలయాలను 6 ‘ఏ 2’ కేటగిరీలో, 2 లక్షల నుంచి 25 లక్షలలోపు వచ్చే ఆలయాలను 6 ‘బీ’ కేటగిరీలో, 2 లక్షల్లోపు వచ్చే టెంపుల్స్​ను 6 ‘సీ’ కేటగిరీలో చేర్చారు. ‘ఏ’ కేటగిరీలోకి వచ్చే ఆలయాల ఆదాయం కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ బీ, సీ కేటగిరీ టెంపుల్స్ పై కొవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. చిన్న ఆలయాలకు వచ్చే భక్తులు తగ్గిపోతున్నారు. గతంలో వీలైతే ప్రతిరోజూ, లేదంటే వారంవారం, ఇంకా శుభదినాల్లో వచ్చే భక్తులు ఇప్పుడు ఏదైనా మొక్కుబడి ఉంటే తప్ప రావడం లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్ప ఆలయం మొహం చూడడం లేదని పూజార్లు చెబుతున్నారు. 

నిర్వహణ కష్టాలు

కరోనా కాలంలో భక్తులు రాకపోవడంతో  టెంపుల్స్ నిర్వహణ భారంగా మారింది. ఆదాయం తగ్గిపోవడంతో బీ, సీ కేటగిరీ టెంపుల్స్​కు నిర్వహణ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టెంపుల్స్ ఆధీనంలో ఉన్న భూముల వేలం పాటలు కూడా ఆగిపోతున్నాయి. బీ, సీ కేటగిరీ టెంపుల్స్ ప్రధాన ఇన్​కం సోర్స్ భూముల వేలం పాటలే.  కరోనా కారణంగా గతేడాది నుంచి భూములు కౌలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల రెండు, మూడుసార్లు వేలం పాటలు నిర్వహించినా స్పందన రాకపోవడంతో వచ్చిన కాడికే భూములు కౌలుకు ఇస్తున్నారు. దీంతో ఆదాయం సగానికి సగం పడిపోయింది. దీనికి తోడు భక్తులు రాకపోవడంతో బ్రహోత్సవాలు కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆలయాల మరమ్మతులు, రంగులు వేయించడం, అన్నదానాలు, ఉత్సవాలు, వేడుకలు నిర్వహించడం కష్టమవుతోంది.  ఉదాహరణకు  నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామంలోని స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయానికి 2019-–20లో  రూ. 21. 56 లక్షల ఆదాయం రాగా, 2020–-21లో కేవలం రూ.12.19 లక్షలు మాత్రమే వచ్చింది. కొంతకాలంగా ఈ ఆలయంలో రిపేర్లు జరుగుతుండగా, ప్రస్తుతం పైసలు లేక పనులు ఆగిపోయాయి. ఇదే మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు వేంకటేశ్వర స్వామి ఆలయానిది కూడా ఇదే పరిస్థితి. గతేడాది రూ.19 లక్షలు ఆదాయం వస్తే, ఈసారి రూ. 12.80 లక్షలకు పడిపోయింది. దీంతో ఆలయ ప్రహరీ, యాగశాల పనులు పెండింగ్​లో పడ్డాయి.

టెండర్లు లేవు..టిక్కెట్ల సేల్స్ లేవు

దేవస్థానాలకు ప్రధానంగా టెండర్లు, టిక్కెట్ల సేల్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రత్యేక అర్చనలు, అభిషేకాల రూపంలో వచ్చే ఆదాయం, దాతల విరాళాలు, భక్తుల కానుకలు వీటికి అదనం. కరోనా వల్ల గడిచిన ఏడాదిన్నర కాలంగా భక్తులు లేక ఆలయాలు బోసిపోతున్నాయి. కొబ్బరికాయలు, పూజాసామగ్రి, తినుబండారాలు, ఆటబొమ్మల షాపులు, కేశఖండనలాంటి టెండర్లు నిలిచిపోతున్నాయి. కొబ్బరికాయలు, ప్రసాద విక్రయ టికెట్లు అమ్ముడుపోవట్లేదు. దీంతో కరోనా ముందుతో పోలిస్తే ఏ ఆలయానికి కూడా సగానికి మించి ఆదాయం రావట్లేదు. కౌంటర్లలో గల్లా పెట్టెలు, హుండీలు అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. 
 

Tagged state, revenue, TEMPLES, covid effect, decline, Komuravelli

Latest Videos

Subscribe Now

More News