అమెరికాలో షట్‌డౌన్ ఎఫెక్ట్.. డెలివరీ బాయ్స్గా ఎయిర్ పోర్టుల స్టాఫ్..

అమెరికాలో షట్‌డౌన్ ఎఫెక్ట్..  డెలివరీ బాయ్స్గా ఎయిర్ పోర్టుల స్టాఫ్..
  • జీతాలు అందకపోవడంతో ఇతర జాబ్ లవైపు చూపు 
  •     సిబ్బంది కొరతతో 23 వేల విమానాల రాకపోకలు ఆలస్యం

వాషింగ్టన్: అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నది. దీని కారణంగా ఇప్పటికే చాలా రంగాలు ప్రభావితం అయ్యాయి.  ప్రధానంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 23 వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. జీతాలు అందకపోవడంతో ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. తమ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ఫుడ్ డెలివరీ యాప్‌లలో జాబ్ లు వెతుక్కుంటున్నారు.  

షట్‌డౌన్, సిబ్బంది కొరతతో డల్లాస్, షికాగో, అట్లాంటా, న్యూయార్క్ ఎయిర్‌పోర్టుల్లో ప్యాసింజర్లు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యూఎస్ఏ టుడే వార్తా సంస్థ నివేదించింది. దాదాపు 13 వేల మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50 వేల మంది ట్రాన్స్ పోర్టేషన్, సెక్యూరిటీ అధికారులు జీతాలు లేకుండానే  పని చేస్తున్నారు. షట్‌డౌన్ ఇలాగే  కొనసాగితే 28న చెల్లించాల్సిన తదుపరి జీతాలు కూడా అందకపోవచ్చు.

 దాంతో  మరింత మంది తమ జాబ్ లను వదిలేసి ప్రత్యామ్నాయాలను చూసుకునే అవకాశముంది. అయితే, షట్‌డౌన్ కారణంగా హెల్త్ సెక్టార్ కూడా ప్రభావితం అవుతున్నది. అఫర్డబుల్ కేర్ యాక్ట్ ఆరోగ్య బీమా లబ్ధిదారులకు ట్యాక్స్  క్రెడిట్‌లు ఈ ఏడాది చివరిలో ముగియనున్నాయి. ఈ సబ్సిడీని పొడించకపోతే 2.4 కోట్ల మంది ప్రభావితం కానున్నారు.