హనుమజ్జయంతి డెడ్​లైన్​.. భద్రాచలం రామాలయం చుట్టూ ఇండ్ల తొలగింపునకు సర్వం సిద్ధం

హనుమజ్జయంతి డెడ్​లైన్​.. భద్రాచలం రామాలయం చుట్టూ ఇండ్ల తొలగింపునకు సర్వం సిద్ధం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. పరిహారం తీసుకున్న వారికి ఇండ్లను ఖాళీ చేసేందుకు హనుమజ్జయంతి డెడ్​లైన్​ విధించారు. ఈనెల 22 తర్వాత వెంటనే ఖాళీ చేయాలని ఇండ్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. రామాలయం పరిసరాల్లో 41 ఇండ్లను ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద రూ.35కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. 

33 మంది ఇప్పటికే పరిహారం తీసుకున్నారు. మరో 8 మంది ఇంకా తీసుకోవాల్సి ఉంది. వీరి కోసం రూ.8కోట్లు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అనంతరం ఇండ్లను పడగొట్టడానికి నిర్ణయించారు. కానీ ఇండ్లలో అద్దెకు ఉంటున్న షాపుల నిర్వాహకులు జిల్లా కలెక్టర్​ను హనుమజ్జయంతి ఉత్సవం వరకు గడువు కోరారు. దీనితో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. కాగా కొందరు షాపుల వారిని ఇంటి యజమానులు ఇప్పటికే ఖాళీ చేయించారు.