నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
  • 20 వేలు డిమాండ్​ చేసిన తిరుపతి
  • మెట్​పల్లి తహసీల్దార్​ ఆఫీసులో కలకలం

మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతు నుంచి లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన ఓ  ఆర్​ఐ, ఆయన ప్రైవేటు అసిస్టెంట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ ఇన్​చార్జి డీఎస్పీ వీవీ రమణ మూర్తి కథనం ప్రకారం..మెట్ పల్లి మండలం మేడిపల్లికి చెందిన బద్దం లక్ష్మి, శంకర్ దంపతులకు గ్రామ శివారులో  797/ఉ/1 లో ఏడు గంటల వ్యవసాయ భూమి ఉంది. దీని నాలా కన్వర్షన్​ కోసం శంకర్​ గత నెల 22వ తేదీన ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తహసీల్దార్ శేఖర్ ను కలిశాడు. నాలా కన్వర్షన్ తొందరగా చేయాలని కోరాడు. ఆయన రెవెన్యూ ఇన్​స్పెక్టర్–1​ తిరుపతిని కలువాలని  చెప్పాడు. శంకర్ ఆర్ఐ తిరుపతిని కలవగా రూ.20 వేలు లంచం ఇస్తేనే పని చేస్తానని చెప్పాడు. తాను అంత ఇచ్చుకోలేనని ​బతిమిలాడాడు. అయినా వినని తిరుపతి 10 రోజులుగా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నాడు.

దీంతో రూ.15 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని మూడు రోజుల క్రితం ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం మెట్​పల్లి తహసీల్దార్ ఆఫీస్ లో బాధితుడు శంకర్ ఆర్ఐ తిరుపతికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లాడు.  అక్కడే ఉన్న తన ప్రైవేటు అసిస్టెంట్ బూరం ప్రవీణ్ కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. దీంతో శంకర్ నుంచి ప్రవీణ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆర్ఐ తిరుపతి, ప్రైవేటు అసిస్టెంట్ బూరం ప్రవీణ్ లపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు. ఏసీబీ సీఐలు రాము, జాన్ రెడ్డి, రవీందర్, తిరుపతి పాల్గొన్నారు.