వరి, పత్తి పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొంటుంది

వరి, పత్తి పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొంటుంది

హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్. వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని గింజలేకుండా కొనుగోలు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుంచి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఈ వానాకాలం మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని తెలిపారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు.  రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్.