వరి సాగు తగ్గించాల్సిందే!

వరి సాగు తగ్గించాల్సిందే!
  • ఇతర  పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయం​
  • వేరుశనగ, పప్పుధాన్యాలు, పత్తి సాగు పెంచాలని ప్లాన్​  
  • ఐసీఏఆర్​ సిఫార్సులకు అనుగుణంగా పంటల మార్పిడికి సన్నాహాలు

నల్గొండ, వెలుగు: వానాకాలం సీజన్​లో రాష్ట్రంలో వరి సాగును వీలైనంత తగ్గించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. వరికి బదులు ఇతర పంటలను సాగు చేసేలా యాక్షన్​ ప్లాన్​రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా పంటల సాగుపై గ్రామాలు, మండలాల వారీగా సర్వే ప్రారంభించింది. ఒక్కసారే వరి సాగును తగ్గిస్తే విమర్శలు వస్తాయని భావించిన సర్కారు విడతల వారీగా వరిసాగును తగ్గించాలన్న ఆలోచనతో ఉంది. గతేడాది నియంత్రిత సాగు పేర దొడ్డు రకం వడ్లను పండించవద్దని, సన్నాలు వేయాలన్న సర్కారు నిర్ణయం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. సన్నాలు పండించిన రైతులు తమ పంటకు సరైన రేటు రాకపోవడంతో  తీవ్రంగా నష్టపోయారు. దీనిపై అప్పట్లో విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈసారి ఆచితూచి ముందుకెళ్తోంది.

కంట్రోల్ చేయకుంటే కష్టమే..
అధికవర్షాలు, నీటి వనరులు పెరగడం, ఫ్రీ కరెంటు వల్ల స్టేట్​లో వరిసాగు విస్తీర్ణం చాలా పెరిగింది.  ఈ యాసంగిలో1.32 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పిన ప్రభుత్వం అందులో 80‌‌ లక్షల టన్నులు కొనేందుకే ముప్పుతిప్పలు పడుతోంది. ప్రతి సీజన్ లోనూ దిగుబడులు పెరుగుతుండడంతో వాటిని కొనడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రి చట్టాలను సాకుగా చూపి ఈసారి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేమని ప్రారంభంలో ప్రకటించిన స్టేట్​గవర్నమెంట్.. కరోనా నేపథ్యం, పార్టీలు, రైతుల ఒత్తిడి వల్ల సెంటర్లు ఓపెన్ చేసింది. ఎఫ్​సీఐకి పెట్టే దొడ్డు వడ్లను మాత్రమే కొన్న సర్కారు సన్నాలను అసలు కొనలేదు. ఇలా అన్నిచోట్ల వరి సాగు చేస్తే మున్ముందు వడ్లను కొనడం సాధ్యం కాదని, స్టోరేజీ కూడా కష్టమేనని భావిస్తున్న ప్రభుత్వం రైతులనే ఇతర పంటల వైపు మళ్లించాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించేలా తాజాగా వ్యవసాయశాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. దీంతో పత్తితో పాటు కంది, పెసర, వేరుశనగ పంటల సాగును ఈ సీజన్ నుంచే పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ, కంది, పెసరకు మంచి రేటు ఉంది. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.

ప్రత్నామ్నాయ పంటలకు గతంలోనే సిఫార్సు
సంప్రదాయ పంటలకు బదులు బహిరంగ మార్కెట్​లో డిమాండ్ ఉన్న పంటల సాగును తప్పనిసరి చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ఇదివరకే సిఫార్సు చేసింది. స్థానికంగా ఉన్న భూములు, వాతావరణ పరిస్థితులు, బహిరంగ మార్కెట్లో పంటల డిమాండ్, సరఫరా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏయే జిల్లాల్లో ఏయే పంటలు పండిస్తే లాభదాయకమో సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో సోయాబీన్,  మంచిర్యాల, జగిత్యాల, నాగర్​కర్నూల్ జిల్లాల్లో మామిడి, మహబూబ్​నగర్, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో తృణధాన్యాలను సాగు చేయాలని ఐసీఏఆర్ సిఫారసు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో మిర్చి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో వరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వేరుశనగ, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో డెయిరీ, ఇతర పంటలు, నల్గొండ జిల్లాలో బత్తాయి, నిజామాబాద్ జిల్లాలో పసుపు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 
చేపల పెంపకాన్ని చేపట్టాలంటూ ఐసీఏఆర్ తన సిఫారసుల్లో పేర్కొంది.

నల్గొండలో కంది, పల్లి సాగు పెంచే ప్లాన్​ 
నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్​లో  12,15,357 ఎకరాల్లో పంటల సాగు జరుగుతుంది. ఇందులో ఎప్పటిలాగే వరి 3.65 లక్షలు, పత్తి 8.10 లక్షల ఎకరాలు సాగవుతుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో  కంది, పెసర, వేరుశనగ పంటలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగును తగ్గించాలని ప్లాన్ చేశారు. ఈ సీజన్​లో జిల్లాలో 35 వేల ఎకరాల్లో కంది, 1,060 ఎకరాల్లో పెసర,  40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయాలని టార్గెట్​పెట్టుకున్నారు. ఈ ప్లాన్​కు తగ్గట్టుగా అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు.  

గ్రామాల్లో అగ్రికల్చర్​ ఆఫీసర్లు చేస్తున్న సర్వేలో పరిశీలిస్తున్న అంశాలివే..  
1.    గ్రామాల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు ?
2.     ఏ ఏ పంటల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి ?
3.     పంటల మార్పిడికి అవకాశం ఉంటుందా ?
4.     ఏ ఏ పంటలు ఎంత సాగు చేసుకునే అవకాశం ఉంది ?
5.     పండించే పంట దిగుబడులకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉంది ?
6.     ఎక్కడెక్కడ దిగుబడులు అమ్ముకుంటున్నారు ? 
7.     మద్దతు ధర లభిస్తుందా.. లేదా .. దళారుల బెడద ఏ మేరకు ఉంటుంది ?
8.     ప్రస్తుతం వానాకాలం లో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకునే అవకాశం ఉంది? 
9.     దానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు ఏ మేరకు సిద్ధంగా ఉంచాలి ?