
- సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న 86,206 ఎకరాలు
- మెదక్ జిల్లాలో మరో 25,166 ఎకరాల్లో నష్టం
ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షానికి మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి, పాంబండ, చిన్నగొట్టిముక్ల కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. చిన్నగొట్టిముక్లలో రోడ్లపై ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. నిజాంపేట సబ్ మార్కెట్ యార్డులో నీరు నిలవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాపన్నపేట మండలంలోని మల్లంపేట, రామతీర్థం, ముద్దాపూర్, పాపన్నపేట, మిన్పూర్, కుర్తివాడ,కొడపాక తదితర గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఆరబెట్టిన వరి దానం కుప్పలు తడిసిపోవడంతో మొలకెత్తాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, దుబ్బాక మండలాల్లో పిడుగుపాటుకు మూడు పాడి బర్రెలు మృతి చెందాయి. రఘోత్తంపల్లి లో మహేందర్ రెడ్డి అనే రైతుకు చెందిన పాడి ఆవు, చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో రైతు కర్రె ఎల్లయ్యకు చెందిన రెండు పాడి ఆవులు చనిపోయాయి.
మొలకలు వస్తున్నయ్
పొలాల్లో వడ్లు, మామిడి కాయలు రాలిపోవడమే కాదు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనకపోవడంతో వర్షానికి తడిసి ముద్దవుతోంది. ఇప్పటికీ రెండు జిల్లాల్లో పూర్తి స్థాయిలో సెంటర్లు ఓపెన్ చేయలేదు. చేసిన చోట కూడా సౌలత్‌లు లేక పూర్తిస్థాయిలో వడ్లు కొనడం లేదు. దీంతో వర్షానికి నాని ఇప్పటికే చాలాచోట్ల మెలకలు వచ్చాయి. ముఖ్యంగా మెదక్, హుస్నాబాద్, చేర్యాల డివిజన్లలో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించినా.. 33 శాతం నష్టం జరిగితేనే అని కొర్రీలు పెట్టడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కౌలు రైతుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.