గొప్ప గ్రీకు తత్త్వవేత్త హెరాక్లిటస్ 2500 సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు ‘ఎవరూ ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేరు,ఎందుకంటే కొత్త నీరు నిరంతరం ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించాడు. అదేవిధంగా 2025 బిహార్ ఎన్నికలు గత 2020 బిహార్ ఎన్నికలతో సమానమని భావించడం సమంజసం కాదు. మనం గమనించాల్సిన అతిపెద్ద మార్పు ఏమిటంటే 2025 ఎన్నికలలో ఓటర్లు 2020 ఎన్నికలతో పోలిస్తే కనీసం 25 శాతం వేరుగా ఉన్నారు, కొత్త ఓటర్లు, మరణాలు, వలసల కారణంగా 2020 ఎన్నికలను ఆధారం చేసుకుని ప్రస్తుతం ఏదైనా అంచనా వేయడం సరికాదు.
1989 నుంచి బిహార్‌లో అదే పాత పార్టీలు, నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం, పాత బాహుబలులు లేదా బలవంతులు లేదా వారి పిల్లలు నాయకులుగా కొనసాగుతున్నారు. అంతేతప్ప ఎలాంటి మార్పు లేదు. 1989 నుంచి లాలూ ప్రసాద్ కుటుంబం,
నితీశ్ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఏకైక కొత్త చేరిక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అక్టోబర్ 2024లో ఆయన ఒక పార్టీని ప్రారంభించాడు. బిహార్‌లో 20 వరకు బాగా స్థిరపడిన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, పాత నాయకులు అన్ని పార్టీలలో ఆధిపత్యం చెలాయిస్తున్నా కొత్తవారికి కూడా స్థానం ఉంటుంది. అయితే, కొత్తగా వచ్చిన వ్యక్తి సూపర్-రిచ్ కాకపోతే ఏ పార్టీ టికెట్ పొందలేడు. మధ్యతరగతి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అతన్ని హేళన చేస్తారు. బిహార్‌లో ప్రజలు నిస్సహాయంగా ఉన్నారు, ఎందుకంటే వ్యవస్థపై కొద్దిమంది మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మోడల్లో..
బిహార్‌లో మార్పు అంటే లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ మధ్య అధికార మార్పు. కానీ, ఇప్పుడు వరల్డ్ ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, వలసల కారణంగా బిహార్‌లో మార్పు వస్తోంది. నరేంద్ర మోదీ బిహార్‌లో తీవ్రంగా ప్రజాదరణ పొందిన వ్యక్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వాతంత్ర్యం తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఆ తర్వాత వారి స్థాయిలో జాతీయస్థాయిలో బహుశా ప్రభావం చూపే మూడో వ్యక్తి మోదీ.
బిహార్ ఎన్నికలు నరేంద్ర మోదీకి కూడా ఒక కీలక పరీక్ష. ఈ క్రమంలో ఇప్పటికీ పెద్ద మార్పులు జరుగుతున్నాయి. బిహార్ కూడా తెలుగు రాష్ట్రాల విధానాన్ని అనుసరిస్తూ సూపర్-రిచ్ వ్యక్తులకు టికెట్లు ఇస్తోంది. గతంలో ధనవంతులను పార్టీలు ఆకర్షించడం రాజకీయ ఆత్మహత్యగా ఉండేది. కానీ, ఇప్పుడు ధనవంతులను సంపాదించడం విజయంగా భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, కర్నాటక మోడల్‌ను అనుకరిస్తున్నారు.
సింగర్స్, డ్యాన్సర్స్‌కు పార్టీల టికెట్లు!
2025 బిహార్ ఎన్నికల వరకు, గాయకులు, భోజ్ పురి (బిహారీ భాష) డ్యాన్సర్స్, సోషల్ మీడియా హీరోలు రాజకీయ పార్టీలకు మాత్రమే మద్దతు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఈ ఎన్నికల్లో చాలా బిగ్ స్టార్స్ పార్టీ టికెట్లపై పోటీచేస్తున్నారు. పెయిడ్ ఎంటర్టైనర్స్, రిచ్ డ్యాన్సర్స్ రాజకీయవేత్తలుగా మారారు. వారు డబ్బును ఖర్చు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు వారిని అనుసరిస్తున్నారు. బీజేపీ కోసం ఎంటర్టైనర్ పవన్ సింగ్ తన భార్యను బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీకి నిలబెట్టాడు. చాప్రా స్థానం నుంచి భోజపురి డ్యాన్సర్ ఖేసారి లాల్ యాదవ్ ఆర్జేడీ (లాలూ ప్రసాద్ పార్టీ) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. తన భార్య చందా దేవి పేరు ఓటర్ లిస్ట్‌లో లేకపోవడంతో ఆయన్ను ఎంపిక చేశారు.
25 ఏళ్ల ప్రసిద్ధ గాయకురాలు మైథిలి థాకూర్ బీజేపీ ఎమ్మెల్యేగా అలీనగర్ (దర్భంగా) నుంచి పోటీ చేస్తోంది, ఆమె బీజేపీలో చేరి మైథిలి సంస్కృతిని ప్రోత్సహించాలని ప్రచారం చేస్తోంది. ఎన్నికల బరిలో లాయర్ సీమా కుష్వాహా కూడా ఉంది, ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో తన విస్తృత డ్రెస్సింగ్ స్టైల్, మాటలతో ప్రసిద్ధి చెందింది. సీమా కుష్వాహాకు టికెట్ దక్కలేదు. ఇది బిహార్‌లో పెద్ద తుపానును సృష్టించింది, ఆమె ఆర్జేడీ తరఫున సాసారామ్ స్థానాన్ని ఆశించింది.
కానీ టికెట్ ఇవ్వలేదు, ఇది వైరల్ అవడంతో వివాదాలకు దారితీసింది. సంక్షిప్తంగా బిహార్‌లో అత్యంత ప్రసిద్ధులు సోషల్ మీడియా స్టార్స్, డ్యాన్సర్స్, సింగర్స్ కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇది ప్రస్తుత ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పార్టీలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ముడిపడి డిజిటల్ క్యాంపెయిన్‌లు నడుపుతున్నాయి.
వలసల ప్రభావం
వలసలు కొత్తేమీ కాదు. కోట్లాది మంది తెలుగువారు విదేశాలకు వలస వెళ్లారు. అలాగే, కోట్లాది బిహారీలు మెరుగైన జీవనం కోసం బిహార్ బయట ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. 1840 నుంచి 1920 వరకు, 2 మిలియన్ల భారతీయులు 19 బ్రిటిష్ కాలనీలకు కూలీలుగా వెళ్లారు. ఇప్పుడు అవి ఫిజీ, మారిషస్, సురినామ్, వెస్ట్ ఇండీస్ వంటి దేశాలు. ఎన్నికల్లో బిహారీ వలసలు చూపే అతిపెద్ద ప్రభావం ఏమిటంటే, వారు ఇప్పుడు తమ స్థానిక నాయకులతో తక్కువ సంబంధాలు కలిగి ఉన్నారు.
వారికి స్థానిక నేతలతో ఎటువంటి విధేయత లేదు. అంతేకాకుండా, ఈ వలసలు ఇతర రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలియజేస్తాయి. వలస వెళ్లినవారు తమ నాయకులను నిందిస్తారు. చాలామంది వలసదారులు ఓటు వేయడానికి తిరిగి వస్తారు. కానీ, అలాంటి వలసదారులు తమ స్థానిక నాయకుల పట్ల తక్కువ విధేయత కలిగి ఉంటారు. వారిని అవినీతిపరులుగా, మోసగాళ్లుగా చూస్తారు. స్థానిక బిహార్ రాజకీయ నాయకుల అధికారం ఇప్పుడు వలసదారులకు ఉపాధి చూపించే స్థాయిలో లేదు.
కులం, ప్రశాంత్ కిషోర్ ప్రభావం
నిస్సందేహంగా బిహార్ ఎన్నికల్లో కుల ప్రభావం ఉంటుంది. ఇండియా అలయన్స్ దీనిని క్యాస్ట్ ఎన్నికగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా హిందూ ధర్మం ఏకీకరణ శక్తిగా ఉండదు. మైనారిటీలు తమ ధర్మం ప్రకారం ఓటు వేస్తుండగా, హిందువులలో క్యాస్ట్ ప్రభావం గతంలో కంటే తక్కువ ప్రాముఖ్యత ఉండవచ్చు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అవినీతి నాయకులను తొలగించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చాడు.
ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ భారీస్థాయిలో సీట్లు గెలవకపోవచ్చు. కానీ, ఆయన పార్టీ 5 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే, ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వస్తాయి. అయితే, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అవినీతి రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ, తన మునుపటి అవతారంలో అతను భారీ డబ్బు ఉన్న అవినీతి రాజకీయవేత్తల కోసం పనిచేశాడు. తన కొత్త అవతారంలో ప్రశాంత్ కిషోర్ బిహారీ రాజకీయవేత్తల అసలు రూపాలను బహిర్గతం చేశాడు. దీని పరిణామాలు దీర్ఘకాలికంగా ఉంటాయి.
మోదీ, బీజేపీపై ప్రభావం
బిహార్ రాజకీయవేత్తల కంటే ఎక్కువగా ఎన్నికల ఫలితాలు బీజేపీ, నరేంద్ర మోదీపై ప్రభావం చూపుతాయి. బీజేపీ అలయన్స్ ఓటమి అంటే.. ఆపరేషన్ సిందూర్ రూపంలో గొప్ప విజయం ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక పరిస్థితితో మధ్యతరగతి అసంతృప్తి ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇటీవల జీఎస్టీ పన్నుల తగ్గింపు చాలా చిన్న చర్య.
మధ్యతరగతిని విస్మరించామని మోదీకి తెలుసు. బీజేపీ కూటమి ఓడిపోతే అది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పెద్ద ఊపును ఇస్తుంది. అంతేకాదు బీజేపీ ఓటమి అమిత్ షా చాణక్య ఇమేజ్‌ను కూడా దెబ్బతీస్తుంది. అలాకాకుండా బీజేపీ కూటమి విజయం సాధిస్తే మోదీకి ఢిల్లీలో సౌకర్యవంతమైన పదవీకాలం, అంతర్జాతీయంగా భారీ ఇమేజ్‌ను అందిస్తుంది.
- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్
