ఇన్ఫర్మేషన్.. ఇష్టమైతేనే ఇస్తారు!

ఇన్ఫర్మేషన్.. ఇష్టమైతేనే ఇస్తారు!

ఒకప్పుడు గవర్నమెంట్​ ఆఫీసు అంటే కంచుకోటలా ఉండేది. లోపల ఏం జరుగుతోందో, అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో… వాళ్లంతటవాళ్లు చెబితే తప్ప జనాలకు తెలిసేదికాదు. సమాచార హక్కు చట్టం (ఆర్​టీఐ) అమల్లోకి వచ్చాక కంచుకోట బద్దలైంది. ప్రజలు తమకు కావలసిన సమాచారాన్ని ఒక్క అప్లికేషన్​ద్వారా పొందుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రజలు అనుభవిస్తున్న సమాచార హక్కును కేంద్రం సవరణ బిల్లుతో వెనక్కి లాగేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార లోపం లేకుండా ‘సమాచార హక్కు చట్టం’ ఏర్పడింది. దీనివల్ల ప్రజలకు అనేక విషయాలు తెలిసొస్తున్నాయి. ఇప్పుడు ఈ చట్టానికి మోడీ ప్రభుత్వం సవరణలు చేపట్టింది.  దీనివల్ల సహ చట్టం ట్రాన్స్​పరెన్సీని మాత్రమే కాకుండా, చట్టబద్ధమైన ఇతర సంస్థలను కూడా అణగదొక్కే ప్రమాదం ఉందంటున్నారు. ఆర్టీఐలో మార్పులు చేయటం ద్వారా మోడీ సర్కారు ఇన్ఫర్మేషన్​ కమిషనర్ల అధికారాలను, శాలరీలను తన కంట్రోల్​లోకి తెచ్చుకుంది.

మన్మోహన్​ సింగ్​ మొదటి విడత అధికారంలో ఉండగా, 2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటివరకు అధికార గోప్యత పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమైన సమాచారం ప్రజలకు అందుబాటులోకి రాసాగింది. ఒక్క అప్లికేషన్​ ద్వారా… ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, కేటాయించిన మొత్తాలు, ఖర్చులు వగైరా ఇన్ఫర్మేషన్​ని దరఖాస్తుదారు పొందగల వీలు చిక్కింది. ఆర్​టీఐ ద్వారా అడిగిన సమాచారాన్ని దాయడానికికూడా ఛాన్స్​ లేకుండా పోయింది.

తాజా సవరణలతో ఈవిధమైన స్వతంత్రతను కోల్పోయింది. ఇకపైన, కేంద్రస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కమిషనర్ల జీతభత్యాలను, కాలపరిమితిని, విధివిధానాలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇది కచ్చితంగా ఆర్​టీఐ పనితీరును దెబ్బతీయడమేనని స.హ.కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ఆర్​టీఐలో తమ జోక్యం ఏమీ ఉండదని చెబుతోంది. ఈ నెల 19న ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన ప్రకటనలో… తన సవరణలను పూర్తిగా సమర్థించుకుంది.  ఎన్నికల కమిషన్​కి, సమాచార కమిషన్​కిగల తేడాని వివరించడానికి ప్రయత్నించింది. ఎన్నికల కమిషన్​ రాజ్యాంగ సంస్థ (కానిస్టిట్యూషనల్​ బాడీ) అని, అందువల్ల దానికి రాజ్యాంగపరంగా స్వతంత్రంగా పనిచేయడానికి వీలుందని తెలిపింది. సమాచార కమిషన్​ కానిస్టిట్యూషనల్​ బాడీ కాదని, ఇది రైటు టు ఇన్ఫర్మేషన్​ యాక్ట్​ (ఆర్​టీఐ) కింద ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థ మాత్రమేనని వివరణ ఇచ్చుకుంది.  కానిస్టిట్యూషనల్​ బాడీకి, స్టాట్యుటరీ సంస్థకు నడుమ వ్యత్యాసాన్ని గుర్తించకుండా తీసుకున్న నిర్ణయానికి దిద్దుబాటు చర్యగా ఆర్​టీఐ అమెండమెంట్​ బిల్లును కేంద్రం సమర్థించుకుంది. ఏదైనా చట్టాన్ని పార్లమెంట్​ ఆమోదించిన తర్వాత ఆ చట్టంద్వారా ఏర్పడే సంస్థల మాదిరిగానే ఇన్ఫర్మేషన్​ కమిషన్​ ఏర్పడింది. కానిస్టిట్యూషనల్​ బాడీ ఏర్పాటును రాజ్యాంగమే నిర్దేశిస్తుంది. లేదా రాజ్యాంగ సవరణద్వారా అవసరమైన సంస్థను ఏర్పాటు చేస్తారు.

ఆర్​టీఐ అమల్లోకి వచ్చాక తొలి కేంద్ర సమాచార కమిషనర్​గా పనిచేసిన ఎం.ఎం.అన్సారీ సవరణలను తప్పుబట్టారు. అన్సారీ 2005 నుంచి 2010 వరకు సీఐసీగా బాధ్యతలు మోశారు. ‘ఆర్​టీఐ సవరణల ముఖ్య ఉద్దేశం ఇన్ఫర్మేషన్​ కమిషనర్ల హోదాని తగ్గించేయడమే. ఎందుకంటే, గతంలో మాదిరిగా కమిషనర్లు ఆర్​టీఐ దరఖాస్తులపై ఆదేశాలు ఇవ్వలేరు. ప్రభుత్వాధికారులకు జవాబుదారీతనం ఉండదు. వాళ్లు చాలా రిలీఫ్​ ఫీలవుతారు. ఇకపైన సహ చట్టం కింద సమాచారం ఇవ్వాలన్నా, దాచి ఉంచాలన్నా  అధికారుల ఇష్టాన్నిబట్టే ఉంటుంది’ అని అన్సారీ ఆవేదన చెందారు.