సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!

సమాచార హక్కు  సామాన్యులకు ఎండమావేనా!

‘ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు. రహస్య ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోతుంది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే  నిర్మూలించబడుతుంది’ అనిఅమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అన్నారు.  మన దేశంలో సమాచార హక్కు చట్టం ( రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ –2005 ) అమలులోకి వచ్చి 2025  అక్టోబర్ 12వ తేదీ నాటికి  ఇరవై ఏండ్లు అవుతుంది. దేశ ప్రజాస్వామ్య పునాదిని పటిష్టంగా ఉంచే  కీలకమైన చట్టాల్లో ఇది ఒకటి. 


ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇన్నేండ్లైనా కానీ.. ఆర్టీఐ అమలు తీరు ‘మేడి పండు చందం’గానే ఉంది. సమాచార పారదర్శకతపై  ప్రభుత్వాలు, అధికారులు చెప్పే మాటలకు.. చేతల్లో పొంతనే లేదు. సమాచార హక్కు ద్వారా ఆఫీసుల్లో  పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొం టున్నారు. దీనికి పాలకులు, అధికారుల  నిర్లక్ష్యం, పొరపాట్లు, వ్యవస్థాగత లోపాలు వంటివే కారణాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. 

దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి 

రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్టీఐకే  దక్కింది. పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. అవినీతి నిర్మూలన, విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం, సుపరిపాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి. పంచాయతీ నుంచి ప్రధాని ఆఫీసు దాకా.. వివిధ స్థాయిల్లో జరిగే అవినీతిని బయటపెట్టడం, జవాబుదారీతనాన్ని పెంచడం, అభివృద్ధి, సంక్షేమాలపై తెలుసుకోవడం, ప్రభుత్వ రికార్డుల తనిఖీ   ఆర్టీఐ  సామాన్యులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం కూడా. ఇది అమలులోకి వచ్చి ఇరవై ఏండ్లే అయినా..  దీనికి తొలి అడుగు పడినది దశాబ్దాల కిందటే అని చెప్పొచ్చు. 1976లో ఉత్తరప్రదేశ్​ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. “ ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పని తీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తప్పకుండా ఇవ్వాల్సిందే.! సమాచార హక్కు రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో  అంతర్భాగమని, స్వేచ్ఛ హక్కు 19(1)(ఏ)లో ఇమిడి ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే సమాచార హక్కు చట్టం రూపొందించుకోవాలనే ఆలోచన పాలకుల్లో వచ్చింది. అనంతరం 2005 నుంచి అమలులోకి వచ్చింది.   

విజయాలెన్నో..అడ్డంకులన్నే..

రెండు దశాబ్దాల కాలంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారులు సాధించిన విజయాలెన్నో ఉన్నాయి.  ఇందుకు ఉదాహరణగా .. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్వెల్త్ గేమ్స్, కోల్ గేట్ స్కామ్ అవినీతి గుట్టు బయట పెట్టడంలో ఆర్టీఐ  కీలకంగా నిలిచింది. జాతీయ ఉపాధి హామీ పనుల సోషల్ ఆడిట్, రికార్డుల తనిఖీలో ఎంతో  సమర్థవంతంగా వినియోగించుకునేలా దోహదపడింది. ఇక దరఖాస్తుదారులకు అడ్డంకులు కూడా చాలా ఎక్కువే. సమాచారం ఇచ్చేందుకు అధికారులు కావాలనే ఆలస్యం చేయడం, లేదా అసంపూర్తిగా ఇవ్వడం, లేదంటే దరఖాస్తులను తిరస్కరించే పరిస్థితులను నూటికి తొంభై శాతం మంది ఎదుర్కొంటుంటారు. అవినీతి బహిరంగ పరిచే ఆర్టీఐ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడడం,  దాడులు వంటివి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వేలమంది దాడులు ఎదుర్కొన్నారు. దేశంలో సామాన్యులు సమాచార హక్కును పొందడంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కొంటున్నట్టు  సర్వేలు తేల్చిచెబుతున్నాయి.  30 రోజుల గడువులోపు ఇవ్వాల్సిన సమాచారానికి నెలల, ఏండ్లకు ఏండ్లు ఎదురు చూడాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం,  పారదర్శకత పాటించకపోవడం కారణాలని సమాచార నిపుణులు సైతం పేర్కొంటున్నారు. 

అవగాహన కల్పించని ప్రభుత్వాలు 

దేశంలోని పౌరులకు ఆర్టీఐ ఒక శక్తిమంతమైన సాధనం అయినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో సరిగా అవగాహన కల్పించడం లేదు. ప్రచారమూ చేయడం లేదు.  గ్రామీణ ప్రాంతాల్లోని చాలామందికి  ఆర్టీఐ  ఉందనేది కూడా తెలియదు. తద్వారా ఆఫీసుల్లో సమాచారాన్ని పొందే హక్కు సామాన్యులకు దక్కడం లేదు. పాఠశాల స్థాయి నుంచే సమాచార హక్కు ప్రాధానత్యపై అవగాహన పెంపొందించాలి. కేంద్ర, రాష్ట్రాల కమిషన్ల వెబ్​సైట్లు కూడా యూజర్ -ఫ్రెండ్లీగా లేవు. అప్లికేషన్ల ఫాలోఅప్,  ఓటీపీల్లో లేట్, పేమెంట్ ఫెయిల్యూర్లు వంటి టెక్నికల్ ఇష్యూలు దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయి. 

దరఖాస్తుదారులు కావలసిన సమాచారం పొందేందుకు నగదును చెల్లిస్తున్నా.. సమాచారం ఇవ్వకుండా.. చట్టాన్ని  సరిగా అమలు చేయకుండా నీరుగార్చుతున్నారు.  ఇలాంటివి కూడా చట్టాన్ని బలహీనం చేస్తూ.. పారదర్శకతకు విఘాతంగా మారాయి. ఆర్టీఐ కమిషన్లను బలోపేతం చేసి.. డిజిటల్ టెక్నాలజీని మెరుగుపరచాలని దరఖాస్తుదారులు, సమాచార నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్టీఐ  విజయవంతం అమలవ్వాలంటే  కమిషన్లను క్రమానుగతంగా బలోపేతం చేస్తుండాలి.  మౌలిక వసతులు కల్పిస్తుండాలి. దరఖాస్తులను, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించాలి. ఇలా సమాచారం వేగంగా, స్పష్టంగా  పొందినప్పుడే సామాన్యులు  ప్రజాస్వామ్య వ్యవస్థలో  చురుకుగా భాగస్వాములవుతారు. ఇలా చేయాల్సిన  బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది.  ఆఫీసుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు  ప్రదర్శిస్తుంటే..  ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు.  మెరుగైన సేవలను అందడంతోపాటు అధికారుల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్య విజయవంతానికి ఓటు హక్కు మాదిరిగానే  సమాచార హక్కు తయారవుతుంది. 

పేరుకుపోతున్న లక్షల దరఖాస్తులు

దేశంలో కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా సమాచార హక్కు కమిషన్లు ఉన్నప్పటికీ ఎవరూ.. చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు.  కేంద్ర, రాష్ట్రాల్లోని కమిషన్లలో ఏటేటా లక్షల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. అప్పీళ్లపైనా విచారణ వేగంగా, సరిగా జరగడంలేదు. ఆర్టీఐ కమిషన్ల నియామకాల్లోనూ రాజకీయ అధికార జోక్యం కూడా ఎక్కువే. సకాలంలో నియామకాలు  చేయడం లేదు.  కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయి.  నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించడం లేదు. ఇలాంటి ఆరోపణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇవి సందర్భానుసారం సామాజిక మాధ్యమాల్లోనూ చూస్తుంటాం కూడా. 2019లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 13, 16లను కేంద్ర ప్రభుత్వం సవరించి.. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే బాధ్యతను కట్టబెట్టుకుంది. కేంద్రం తీరుతో సమాచార కమిషనర్ల స్వతంత్రతకే  ముప్పు తలెత్తిందని, సమాచార హక్కు చట్టం ఉనికి ప్రమాదమని సమాచార నిపుణుల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. ఆర్‌‌‌‌టీఐ జబ్బుపడిన చట్టంగా మారిందని వ్యాఖ్యలు కూడా చేశారు.  

- వేల్పుల సురేష్,
 సీనియర్ జర్నలిస్ట్​