ఒర్లీ.. ఒర్లీ నా గొంతు పోయింది.. ఇది కరెక్ట్ కాదు: ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్

ఒర్లీ.. ఒర్లీ నా గొంతు పోయింది.. ఇది కరెక్ట్ కాదు: ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్

న్యూఢిల్లీ: పార్లమెంట్‎లో ప్రతిపక్షాలు నిరంతరాయంగా అంతరాయం కలిగించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసి చేసి తన గొంతు పోయిందని మండిపడ్డారు.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత అని, ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ ప్రశ్నలు అడగాల్సిన ప్రతిపక్షం పారిపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సజావుగా సాగకపోతే అది ప్రతిపక్షానికే నష్టమని.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎలాగైనా బిల్లులను ఆమోదిస్తుందన్నారు.

 సభలో పదేపదే అంతరాయాలు ఏర్పడటం వల్ల తమ నియోజకవర్గాల ఆందోళనలను లేవనెత్తలేకపోవడం పట్ల చాలా మంది ఎంపీలు వ్యక్తిగతంగా నిరాశ చెందారన్నారు. అర్థవంతమైన చర్చలు, సంభాషణలపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని, వాళ్లు పార్లమెంటరీ చర్చలను నమ్మరని విమర్శించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలు దేశం విజయం, ప్రతిపక్షాల వైఫల్యం అని అభివర్ణించారు. తీవ్రమైన నేరాపణలపై అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించి చారిత్రాత్మక బిల్లుతో పాటు అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదించబడ్డాయని గుర్తు చేశారు.

  ఈ బిల్లు నుండి ప్రధానమంత్రిని మినహాయించాలన్న సిఫార్సులను ప్రధాని మోడీ తిరస్కరించారని తెలిపారు కిరణ్ రిజుజు. తప్పు చేస్తే ప్రధానమంత్రి అయినా సరే జైలుకి వెళ్లి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని మోడీ తేల్చి చెప్పారని అన్నారు. ఇంత పారదర్శకత ఉన్న బిల్లుపై ప్రతిపక్షాలకు ఏ అభ్యంతరం ఉందని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎంపీలు సభలో ఉద్దేశపూర్వకంగా బిల్లుల కాపీలను చించివేస్తున్నారని, హోంమంత్రి మైక్రోఫోన్‌ను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలు సభలో అన్ని పరిమితులు దాటారని నిప్పులు చెరిగారు.

సభలో గందరగోళం సృష్టించి హెడ్ లైన్స్‎లో నిలవాలని వారి పార్టీ హైకమాండ్ ప్రతిపక్ష ఎంపీలను ఆదేశించిందని ఆరోపించారు. ఇక, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎవరో ఇచ్చిన నోట్ చదువుతూ మధ్యలో వేరే టాపిక్‎లోకి వెళ్లిపోతాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని, దేశ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. హైడ్ లైన్స్‎లో ఉండటానికి రాహుల్ గాంధీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, ఆయన చర్యలు ఓట్ బ్యాంక్‎గా మారవని చురకలంటించారు. 

బీజేపీ ఎల్లప్పుడూ అధికారంలో ఉండకపోవచ్చు కానీ కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలను గౌరవించడం ద్వారా నిర్మాణాత్మక రాజకీయాల్లో పాల్గొని ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని హితవు పలికారు. వచ్చే సమావేశాల్లోనైనా ప్రతిపక్షాలు సభలో నిర్మాణాత్మక చర్చకు సహకరించాలని కోరారు. మేం చర్చను నమ్ముతామని..  ఒకవేళ పార్లమెంట్ సజావుగా నడవకున్న అది ప్రతిపక్షాలకే తప్ప.. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీహార్ ఓటర్ సవరణ జాబితా, ఓట్  చోరీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయ సభలు సజావుగా సాగలేదు.