
భక్తి, పౌరాణిక అంశాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార: చాప్టర్ 1' మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రియుల నిరీక్షణకు తెరపడింది. ఈరోజు, సెప్టెంబర్ 26, 2025న అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. మధ్యాహ్నం నుంచి బెంగళూరులో టికెట్ విక్రయాలు ప్రారంభం కాగానే, అభిమానులు తమ సీట్లను దక్కించుకునేందుకు ఎగబడ్డారు. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి
రిషబ్ శెట్టి మాయాజాలం.. కథా నేపథ్యం
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి. 'కాంతార' కథ మొదలవడానికి ముందు, ఆ పౌరాణిక ప్రపంచంలో ఏం జరిగిందనే అంశాన్ని ఈ ప్రీక్వెల్ లో లోతుగా చూపిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి 'బేర్మే' అనే యోధుడి పాత్ర పోషించారు. బనవాసిలోని కదంబ రాజుల కాలంనాటి కథగా దీనిని తెరకెక్కిస్తున్నారు. దైవ కోల సంస్కృతికి మూలాలు, రాజులు-ప్రజల మధ్య సంఘర్షణ, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ఇందులో అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని చాటి చెప్పింది. ఆద్యంతం ఉత్కంఠ, భారీ యాక్షన్ దృశ్యాలు, రిషబ్ శెట్టిలోని దివ్యశక్తి అంశాలు, బి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన గూస్‌బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తెలుగు ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై అంచనాలను పతాక స్థాయికి చేర్చింది.
భారీ యుద్ధం..
ఈ సినిమాలో ఒక భారీ యుద్ధ సన్నివేశం కోసం ఏకంగా 500 మంది ఫైటర్లు, 3,000 మందికి పైగా నటీనటులు పాల్గొన్నట్లు, దానిని 45-50 రోజులు చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ విజువల్స్, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ మరో స్థాయిలో ఉంటాయి. ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణీ వసంత (కనకవతి), గుల్షన్ దేవయ్య (క్రూరమైన యువరాజు కులశేఖర), మరియు జయరాం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రూ. 100 కోట్లకు తెలుగు థియేటర్స్ రైట్స్..
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో 7,000కు పైగా స్క్రీన్‌లలో విడుదలవుతోంది. అక్టోబర్ 1న 2,500లకు పైగా థియేటర్లలో ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ , గీతా ఆర్ట్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.100 కోట్ల భారీ డీల్‌తో ఈ రైట్స్ అమ్ముడవడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ని స్పష్టం చేస్తున్నాయి. తొలుత కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.
ఇప్పటికే విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి వసూళ్లను సాధించాయి. అఖండ విజయానికి అన్ని మార్గాలు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులకు ఇక మిగిలింది.. చరిత్రకు ముందు జరిగిన ఆ అద్భుతమైన గాథను వెండితెరపై చూసి తీరడమే. మరి ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.