
భారీ అంచనాలతో కన్నడ నాట నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రం "కాంతార: చాప్టర్ 1". దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. దర్శకుడు, రచయిత, నటుడు రిషబ్ శెట్టి మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తొలిరోజే భారీ ఓపెనింగ్ తో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
తొలిరోజు వసూళ్లలో సంచలనం!
ఈ పౌరాణిక ఇతిహాసం మొదటి రోజే రూ. 60 కోట్లు కొల్లగొట్టి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. ఇది కేవలం కలెక్షన్ మాత్రమే కాదు, సినిమాపై ప్రేక్షకులకున్న అపారమైన ఉత్సాహాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న హైప్‌ను తెలియజేస్తోంది. అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ భారీ చిత్రం జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ల రొమాంటిక్-కామెడీ 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' కేవలం రూ. 9 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో, 'కాంతార: చాప్టర్ 1' జోరు ముందు బాలీవుడ్ బిగీ సైతం వెలవెలబోయింది. ఈ చిత్రం ఉత్తర అమెరికా ప్రీమియర్ షోల నుంచే అర మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం.
ALSO READ : హనుమంతుడి తెగువ, ధైర్యం కలిసొచ్చేలా వరుణ్ తేజ్, లావణ్య కొడుకు పేరు !
కర్ణాటకలో మొదటి రోజు ఆక్యుపెన్సీ ఊహించని స్థాయిలో నమోదైంది. మార్నింగ్ షోలు 73.56శాతం, మధ్యాహ్నం 96.14శాతం, సాయంత్రం 90.78 శాతం, నైట్ షోలు 92.04 శాతంతో రికార్డు సృష్టించాయి. ఈ చిత్రం అంతకుముందు విడుదలైన అనేక పెద్ద బడ్జెట్ చిత్రాలైన 'సైయారా' (రూ. 22 కోట్లు), 'సికందర్' (రూ. 26 కోట్లు), 'ఛావా' (రూ. 31 కోట్లు) కంటే కూడా అత్యధికంగా ఓపెనింగ్‌ను నమోదు చేసి, ఈ సంవత్సరం అతిపెద్ద భారతీయ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది.
స్ఫూర్తిదాయక ప్రయాణం
'కాంతార: చాప్టర్ 1' కథ, దర్శకత్వం, ప్రధాన పాత్ర పోషించిన రిషబ్ శెట్టికి ఈ విజయం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన మొదటి సినిమాకి ఒకే ఒక్క షో కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా 5,000+ హౌస్‌ఫుల్ షోలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటున్నాను. "2016లో ఒక సాయంత్రం షో కోసం కష్టపడటం నుంచి 2025లో 5000 పైగా హౌస్‌ఫుల్ షోల వరకు... ఈ ప్రయాణం కేవలం మీ ప్రేమ, మద్దతు మరియు దైవ కృప వల్లే సాధ్యమైంది" అని ఆయన తన X (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
పురాణాల లోతుల్లోకి...
హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.
ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. 'కాంతార' ఫ్రాంచైజీ కేవలం వినోదం మాత్రమే కాక, మన సజీవ వారసత్వం, విశ్వాసం యొక్క ప్రతీకగా నిలిచిందని అభినందిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .