
అహ్మదాబాద్: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత కొద్ది నెలల్లో తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతోపాటు ఇంగ్లండ్ సిరీస్‌ల్లో తన సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే ఛాన్స్‌ను దక్కించుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్‌కు దూరమవ్వడం కూడా పంత్‌కు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న పంత్.. ఢిల్లీని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌పై టీమిండియా మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా స్పందించాడు. ఫ్యూచర్‌లో ఇండియాకు కెప్టెన్ అయ్యే అర్హత పంత్‌కు ఉందని తాను నమ్ముతున్నానని ఓజా చెప్పాడు. ‘ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ నడిపిస్తున్న తీరు బాగుంది. ఇదేతీరులో పంత్ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ అనుభవాన్ని గడిస్తే టీమిండియాకు అతడు కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ను కొట్టిపారేయలేం. పంత్ బ్యాటింగ్, వ్యవహార శైలి, ఆ దూకుడు, టీమ్‌ను నడిపిస్తున్న తీరు అంతా చూస్తుంటే భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి’ అని ఓజా చెప్పుకొచ్చాడు.