బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా  ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. మెజారిటీ పార్లమెంటు సభ్యుల (188 మంది)  మద్దతు లభించడంతో ఆయనను ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. కనీసం 30 మంది కూడా ఎంపీల మద్దతు లేకపోవడంతో రిషి ప్రత్యర్ధి పెన్నీ మోర్డాంట్ చివర్లో పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఏకగ్రీవంగా రిషికి ప్రధాని పదవి ఖరారైంది. రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని గతవారం భావించినప్పటికీ.. ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్  ప్రధాని అయ్యేందుకు లైన్ క్లియర్  అయింది.  ఈ ఎన్నికలో బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషి సునాక్ కే మద్దతు ప్రకటించడం విశేషం.

ఎందుకీ మధ్యంతర ఎన్నిక ?

బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ఈ మధ్యంతర ఎన్నిక వచ్చింది. దీంతో గతంలో జరిగిన ప్రధాని ఎన్నికలో లిజ్ ట్రస్ చివరిదాకా బలమైన పోటీ ఇచ్చిన రిషి సునాక్ వైపు అందరి దృష్టి మళ్లింది. బ్రిటన్ మీడియా కూడా తదుపరి ప్రధాని రిషియే అంటూ కథనాలు ప్రచురించాయి. సర్వే నివేదికలు విడుదల చేశాయి. ఎట్టకేలకు వాటిని  నిజం చేస్తూ రిషి బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు.  అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడిగా 2008 సంవత్సరంలో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. తాజాగా బ్రిటన్ లోనూ రిషి ఇలాంటి కొత్త చరిత్రే లిఖించారు. 

రిషి నేపథ్యం ఇదీ.. 

రిషి సునాక్ పేరెంట్స్ పేరు యశ్విర్, ఉషా సునాక్. 1950వ దశకంలో వారు ఇండియా నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ ఫార్మసిస్టులుగా స్థిరపడ్డారు. అయితే మెరుగైన ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ.. వారు 1960వ దశకంలో బ్రిటన్ లోకి అడుగుపెట్టారు. సౌతాంప్టన్ నగరంలో ఉండగా యశ్విర్, ఉషా సునాక్ దంపతులకు 1980 మే 12న రిషి  జన్మించారు.  రిషి విద్యాభ్యాసం  చాలావరకు బ్రిటన్ లోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క.

2015లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నిక

2015లో తొలిసారి యార్క్ షైర్ స్థానం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎంపికైన సమయంలో ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేశారు. అంచెలంచెలుగా కన్జర్వేటివ్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. బోరిస్ జాన్సన్ ప్రధాని పగ్గాలు చేపట్టాక ఆయనకు పాలనా వ్యవహారాల కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఈక్రమంలో క్లిష్టమైన కరోనా సంక్షోభ సమయంలో (2020లో) అత్యంత కీలకమైన బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని రిషి చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. దీర్ఘకాలిక వ్యూహంతో ఆర్థిక ప్రణాళికలకు రూపకల్పన చేయడంలో రిషి తనకు తానే సాటి అని అంటుంటారు. 

పలు వివాదాల్లో..

రిషి సునాక్‌ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సతీమణి అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో అధికారిక నివాసం డౌనింగ్‌ స్ట్రీట్‌లోని నంబరు 10 నుంచి ఖాళీ చేసి మరోచోటికి మారిపోయారు. అనంతరం అక్షతా మూర్తి వివాదం సద్దుమణిగింది. ఇక అక్షతామూర్తి నివాస హోదా కూడా వివాదాస్పదమైంది. ఈ ఏడాది ఆమె 30,000 పౌండ్లు చెల్లించి తన నాన్‌-డొమిసిల్‌ హోదాను ఏడాది పాటు పొడిగించుకొన్నారు. ఆమె యూకేలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ హోదాను వాడుకొంటున్నారని సునాక్‌ ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై అప్పట్లో అక్షత ఉద్వేగంగా స్పందించారు. ‘నా పన్ను హోదా నా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారకూడదని భావిస్తున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా లభించే ఆదాయంపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తాను’ అని ఆమె ప్రకటించారు. 

లిజ్ ట్రస్ ఎందుకు గద్దె దిగారు ? 

మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపింది. దీంతో  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లిజ్ ట్రస్ ప్రధానిగా ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ సవ్యంగా లేకపోవడంతో డాలరుతో పోలిస్తే పౌండ్ మారకం విలువ పతనమైంది. ప్రభుత్వ రుణ వడ్డీ రేట్లు పెరిగాయి. 2 శాతం ఉండాల్సిన ద్రవ్యోల్బణం రేటు కాస్తా 10 శాతం దాటేసింది. ఈనేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీలోని మెజార్టీ సభ్యుల్లో లిజ్ ట్రస్ పై అసహనం పెరిగింది. ఈ తరుణంలో ఇటీవల నిర్వహించిన పోల్ లో.. కన్జర్వేటివ్ పార్టీలో దాదాపు 62 శాతం మంది తాము సరైన వ్యక్తిని ఎన్నుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. నిజానికి కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల నిబంధనల ప్రకారం బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వారిని గద్దె దించాలంటే కనీసం ఏడాది పాటు వేచి ఉండాల్సిందే. అయితే పార్టీ నిబంధనలను మార్చే అధికారం కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల కమిటీకి ఉంది. ఈ కమిటీకి హెడ్‌గా గ్రాహమ్‌ బాడీ పనిచేస్తున్నారు. ఇటీవల 100 మంది పార్లమెంట్‌ సభ్యులు తమ అవిశ్వాస పత్రాలను అక్టోబరు 24లోగా బ్రాడీకి సమర్పించేందుకు సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి.  ఈ పరిణామం నేపథ్యంలోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం గమనార్హం.