పెరుగుతున్న గోల్డ్​ ధరలు.. తగ్గుతున్న డిమాండ్​

పెరుగుతున్న గోల్డ్​ ధరలు.. తగ్గుతున్న డిమాండ్​

న్యూఢిల్లీ: ధరలు ఎక్కువగా ఉండడంతో బంగారానికి గిరాకీ తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్​లో మనదేశంలో దీనికి డిమాండ్​ 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పడిపోయిందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​(డబ్ల్యూజీసీ) ప్రకటించింది. అయితే పోయిన సంవత్సరంలో మార్చి క్వార్టర్​ డిమాండ్​ 135.5 టన్నులని తెలిపింది. ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్లే డిమాండ్​ తక్కువగా ఉంది. మార్చి క్వార్టర్​లో పండుగలు కూడా తక్కువగా ఉండటం వల్ల గిరాకీ మందకొడిగా ఉందని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ పీఆర్​ సోమసుందరం చెప్పారు. అమెరికాలో వడ్డీరేట్లు పెరగడంతో డాలర్​ విలువలో మార్పుతో రూపాయి తగ్గిందన్నారు.

దీంతో బంగారం ధర రూ.60 వేల స్థాయికి వెళ్లిందని, గత ఏడాదితో పోలిస్తే ధరలు 19 శాతం పెరిగాయని వివరించారు. అందుకే చాలా మంది పాత బంగారాన్ని కరిగించి కొత్తవి చేయించుకున్నారని, కొంతమంది మాత్రం తక్కువ మొత్తంలో బంగారం కొన్నారని పేర్కొన్నారాయన. ​ విలువ పరంగా చూస్తే ఈ క్వార్టర్​లో ఇది వార్షికంగా తొమ్మిది శాతం తగ్గి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు చేరుకుంది. 2023 మొదటి క్వార్టర్​లో మొత్తం ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గి 78 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 94.2 టన్నులుగా ఉంది. నగల డిమాండ్ విలువ 2022 మొదటి క్వార్టర్​తో పోలిస్తే 9 శాతం తగ్గి రూ.42,800 కోట్లకు చేరింది.  బంగారు కడ్డీలు,  నాణేల కొనుగోళ్లు కూడా 2023 మొదటి క్వార్టర్​లో 41.3 టన్నుల నుండి 17 శాతం తగ్గి 34.4 టన్నులకు పడిపోయాయి. ఆర్​బీఐ రేట్లు తగ్గినప్పటికీ 2023లో బంగారం డిమాండ్‌‌‌‌ పెరగలేదని, రాబోయే క్వార్టర్​లో వర్షాల వల్ల డిమాండ్​ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 2023లో బంగారానికి డిమాండ్​ 750–-800 టన్నులు ఉంటుందని భావిస్తున్నామని సోమసుందరం వివరించారు.  2023 మొదటి క్వార్టర్​లో మొత్తం ఇన్వెస్ట్​మెంట్​ డిమాండ్ 17 శాతం తగ్గి 34.4 టన్నులకు చేరిందని, గత ఏడాది ఇదే కాలంలో 41.3 టన్నులుగా ఉందని డబ్ల్యూసీజీ రిపోర్ట్​ పేర్కొంది. విలువ పరంగా చూస్తే, 2022 జనవరి-–మార్చి మధ్యకాలంలో రూ. 18,750 కోట్ల నుండి రూ.17,200 కోట్లకు పడింది. రీసైకిల్డ్​ మొత్తం బంగారం ఇదేకాలంలో 25 శాతం పెరిగి 34.8 టన్నులకు చేరుకుంది.  

గ్లోబల్​గానూ తగ్గుదలే 

గ్లోబల్​ గోల్డ్ ​డిమాండ్ -మార్చి క్వార్టర్​లో ఏడాది ప్రాతిపదికన 13 శాతం తగ్గి 1,080.8 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ తెలిపింది. యూరోపియన్- లిస్టెడ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్​) ప్రొడక్టుల నుంచి అవుట్​ఫ్లోలు ఇందుకు కారణమని తెలిపింది.   2022 మొదటి క్వార్టర్​లో మొత్తం బంగారం డిమాండ్ 1,238.5 టన్నులుగా ఉంది డబ్ల్యూజీసీ  గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2023 పేర్కొంది. మొదటి క్వార్టర్​ గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌‌‌‌ల హోల్డింగ్‌‌లు పడిపోయాయి.  జనవరి,  ఫిబ్రవరిలో 29 టన్నుల అవుట్‌‌ఫ్లో ఉంది. ఇది 1.5 బిలియన్ డాలర్ల అవుట్‌‌ఫ్లోకు సమానం. యూరప్​ లిస్టెడ్ ప్రొడక్టుల నుండి ఎక్కువ అవుట్‌‌ఫ్లోలు వచ్చినట్లు రిపోర్ట్​ పేర్కొంది.

అయితే, నార్త్ అమెరికన్ -లిస్టెడ్ ఈటీఎఫ్‌‌లు 2023 మొదటి క్వార్టర్​లో ఇన్‌‌ఫ్లోలను పెంచుకున్నాయి. డిమాండ్​ తగ్గినప్పటికీ అమెరికా బ్యాంకింగ్ రంగంలో కల్లోలం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎకానమీలో సమస్యల కారణంగా ఇప్పటికీ బంగారాన్ని ‘సేఫ్​ అసెట్​’గా చూస్తున్నారని డబ్ల్యూసీజీ తెలిపింది.  ఈ సంవత్సరం ఇన్వెస్ట్​మెంట్​ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని,  వడ్డీ రేట్ల పెంపు ఇందుకు దోహదపడుతుందని ఒక ఎనలిస్టు చెప్పారు.   సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కూడా బలంగా ఉండే అవకాశం ఉందని వివరించారు. మార్చి క్వార్టర్​లో  సింగపూర్, చైనా  టర్కీ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు టన్నులు కొన్నదని సోమసుందరం చెప్పారు.