సర్కార్ కు వ్యాట్ తో రోజుకు రూ. 55 కోట్ల ఆదాయం

సర్కార్ కు వ్యాట్ తో రోజుకు రూ. 55 కోట్ల ఆదాయం

పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్యుడి నడ్డి విరస్తుంటే రాష్ట్ర సర్కారుకు మాత్రం కాసుల పంట కురిపిస్తున్నాయి. ధరలు ఎంత పెరిగితే అంత ఆదాయం వ్యాట్ ద్వారా రాష్ట్రానికి వస్తోంది. తెలంగాణ సర్కార్ కు వ్యాట్ తో రోజుకు 55 కోట్ల ఆదాయం వస్తోంది. ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా తెలంగాణ సర్కార్ మాత్రం స్పందించడంలేదు. వ్యాట్ తో సామాన్య ప్రజలపై భారం మోపుతునే ఉంది.  

నాలుగు నెలల కింద కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కొద్దిమేర తగ్గించినా.. ఇప్పుడు రేట్లు పెంచుకుంటూ పోతుంది. పెట్రో రేట్లు పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఆదాయం వస్తుంది. పెట్రోల్, డీజిల్ల్ పై దేశంలోనే అత్యధికంగా వ్యాట్   విధిస్తున్న రెండో రాష్ట్రం  తెలంగాణ. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్  తగ్గించినా తెలంగాణ మాత్రం తగ్గించలేదు. వ్యాట్ కు తోడు.. డీజిల్   రేట్లు పెరిగాయన్న సాకుతో ఆర్టీసీ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పెంచుతూ పోతుంది. ఒక్క ఆర్టీసీ ద్వారానే వ్యాట్   రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సుమారు కోటిన్నర ఆదాయం వస్తుంది. అయినా కూడా సర్కార్ ప్రయాణికులపై ఇంకా చార్జీలు, సెస్ల భారం పెంచుతూనే ఉంది.

ప్రస్తుతం పెట్రో రేట్లు పెరగడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరగడంతో ఆటోమెటిక్ గా అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలు మొదలుకొని, కిరాణ సామాన్ల వరకు అన్నింటి రేట్లు ఆకాశానంటుతున్నాయి.  ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 30 లక్షల మందికిపైగా ప్రయాణిస్తుంటారు. సుమారు 9 వేల బస్సులు నడుస్తున్నాయి. రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. వ్యాట్ రూపంలో ఆర్టీసీ నుంచి సర్కారుకు ఒక్క రోజులో  కోటిన్నర పైగా సమకూరుతుంది. ఆర్టీసీ మాత్రం డీజిల్ ధరలు పెరిగాయని ఇప్పటికే పలు రకాల చార్జీలు పెంచేసింది. ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్, డీజిల్ సెస్ పేరుతో పాటు రౌండ్ ఫిగర్ అని ప్రయాణికులపై భారం మోపుతుంది. బస్ పాస్ చార్జీలను పెంచేసింది. త్వరలో బస్సు కిరాయిని మరో 20 నుంచి 30% పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

హైదరాబాద్‌‌‌‌లో ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలె!