కొడుకునే కనాలి.. గర్భిణులపై భర్త, అత్తమామల ఒత్తిళ్లు.. మానసికంగా కుంగిపోతున్న మహిళలు

కొడుకునే కనాలి.. గర్భిణులపై భర్త, అత్తమామల ఒత్తిళ్లు.. మానసికంగా కుంగిపోతున్న మహిళలు
  • ఇప్పటికే ఆడపిల్లలు ఉన్న గర్భిణుల పరిస్థితి మరీ  దారుణం 
  • కడుపుతో ఉన్నా అనే సంతోషం కంటే.. పుట్టబోయేది ఆడ బిడ్డా, మగ బిడ్డా? అని టెన్షన్
  • పెరినెటల్ మెంటల్ హెల్త్ పై ఆక్స్​ఫర్డ్ వర్సిటీ, జార్జ్ ఇన్​స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ స్టడీ 
  • సిద్దిపేట జిల్లాలోని 8 గ్రామాల్లో 65 మంది గర్భిణులు, 
  • కుటుంబ సభ్యులు, డాక్టర్లతో ముఖాముఖి 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గర్భిణులు, బాలింతల జీవితాల్లో పైన కనిపిస్తున్నంత ప్రశాంతత లేదని, వారి మనసు ఎన్నో ఆందోళనలు, వేదనలతో నిండి ఉందని ఇంటర్నేషనల్ రీసెర్చ్​లో తేలింది. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే మానసిక సమస్యలు (పెరినెటల్ మెంటల్ హెల్త్) కేవలం ఆరోగ్యానికి సంబంధించినవి మాత్రమే కాదని, వీటి వెనుక సమాజంలో వేళ్లూనుకున్న వివక్ష, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది.

 గర్భంతో ఉన్నా అనే సంతోషం కంటే.. పుట్టబోయేది ఆడ బిడ్డా, మగ బిడ్డనా? అనే టెన్షన్​ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆక్స్‌‌ ఫర్డ్ యూనివర్సిటీ, జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థలు సిద్దిపేట జిల్లాలోని 8 గ్రామాల్లో ఈ రీసెర్చ్ నిర్వహించాయి. మొత్తం 65 మంది గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు, వైద్య నిపుణులతో ముఖాముఖిచర్చించి, గ్రామీణ మహిళల మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్న 36 ప్రధాన సామాజిక అంశాలను రీసెర్చర్లు గుర్తించారు.

  • మగపిల్లాడి కోసమే..  

గర్భిణుల మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్న ప్రధాన అంశాల్లో లింగ వివక్ష మొదటి స్థానంలో ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొడుకు పుడితేనే వంశం నిలుస్తుందనే పాతకాలపు ఆలోచనలు బలంగా ఉన్నాయని, కచ్చితంగా మగపిల్లాడినే కనాలంటూ అత్తమామలు, భర్తల నుంచి మహిళలపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని రీసెర్చర్లు పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఇదివరకే ఆడపిల్లలు ఉన్న గర్భిణుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటోంది. ఆడపిల్ల పుడితే భవిష్యత్తులో పెళ్లిళ్లు, కట్నకానుకల భారం మోయలేమనే ఆందోళన వారిని కుంగుబాటులోకి నెడుతోంది. ఒకవేళ ప్రసవంలో ఇబ్బందులు ఎదురైనా, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినా ఆ నిందను తల్లిపైనే వేయడం, గర్భస్రావం లాంటి నెగటివ్ ఫలితాలు ఇతర గర్భిణులకు సోకుతాయనే నెపంతో బాధితులను సామాజికంగా వెలివేయడం వంటి పద్ధతులు మహిళల మనసును వికలం చేస్తున్నాయి.

  • భర్త, అత్తమామల పెత్తనమే..

గ్రామీణ ఉమ్మడి కుటుంబాల్లో గర్భిణులకు కనీస స్వేచ్ఛ, నిర్ణయాధికారం ఉండడం లేదని  రీసెర్చ్ పేర్కొంది. ఆహారం తీసుకోవడం నుంచి హాస్పిటల్ కు వెళ్లే వరకు ప్రతి విషయంలోనూ అత్తమామలు, భర్తల పెత్తనమే సాగుతున్నది. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటి పనులు, పొలం పనులు చేయాల్సి రావడం, అందరికంటే చివరగా మిగిలిన ఆహారాన్ని తినాలనే కట్టుబాట్లు వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 

గర్భంతో ఉన్నా కుటుంబ పోషణకు పొగాకు, వ్యవసాయ రంగాల్లో కూలీ పనులకు వెళ్లడం వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. దీనికి తోడు భర్తలు మద్యం తాగి చేసే హింస వల్ల పల్లె మహిళల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని రిపోర్టు హెచ్చరించింది. గృహహింసను సమాజం ఓ నేరంగా కాకుండా కుటుంబ అంతర్గత వ్యవహారంగా చూడడం వల్ల బాధితులకు సరైన న్యాయం, మద్దతు అందడం లేదని స్టడీ స్పష్టంచేసింది.

  • కుటుంబానికి కౌన్సెలింగ్ అవసరం.. 

మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు గర్భిణులకు చికిత్స అందకుండా చేస్తున్నాయి. మానసిక బాధ అంటే కేవలం పిచ్చి అని మాత్రమే భావించడం వల్ల, తమ గోడును బయట చెప్పుకోలేక మహిళలు కుమిలిపోతున్నారు. గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉండే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ఈ సమస్యలపై సరైన అవగాహన లేకపోవడం, నిపుణులైన డాక్టర్లు కేవలం పట్టణాలకే పరిమితం కావడం వల్ల మహిళలు మంత్రగాళ్లు, తంత్రగాళ్లు, తాయెత్తుల వంటి మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. 

కేవలం మందులతోనే ఈ పరిస్థితి మారదని, మహిళలతో పాటు భర్తలకు, అత్తమామలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని రీసెర్చర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య పథకాల్లో మానసిక ఆరోగ్యాన్ని అంతర్భాగం చేయాలని, గర్భిణుల పట్ల సామాజిక దృక్పథం మారినప్పుడే వారు ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వగలరని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.