సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి‌‌‌‌- కృష్ణా– పెన్నా– కావేరి నదుల అనుసంధానం

సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి‌‌‌‌- కృష్ణా– పెన్నా– కావేరి నదుల అనుసంధానం

హైదరాబాద్, వెలుగు:  సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి‌‌‌‌-– కృష్ణా–- పెన్నా–- కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ  నిర్మించి ఈ నదులను లింక్ చేయాలన్న ఎన్ డబ్ల్యూడీఏ ప్రతిపాదనకు తెలంగాణ ససేమిరా అన్నది. సోమవారం జలసౌధలో రివర్ లింకింగ్ టాస్క్​ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం అధ్యక్షతన టాస్క్ ఫోర్స్17వ మీటింగ్ జరిగింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్​రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు, ఎన్​డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో పర్బతి– కలిసింద్– చంబల్, గోదావరి– కృష్ణా– పెన్నా– కావేరి అనుసంధానంపై చర్చించారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ  నిర్మించి గోదావరి నీళ్లను మళ్లించాలన్న ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఇచ్చంపల్లి వద్ద నిర్మిస్తే మేడిగడ్డ, సమ్మక్క బ్యారేజీ ​లపై ప్రభావం పడుతుందని, అది తమకు ఆమోదయోగ్యం కాదని స్పెషల్ సీఎస్​  రజత్ ​కుమార్, ఈఎన్సీ మురళీధర్ తేల్చిచెప్పారు. దీంతో ఇచ్చంపల్లి కాకుండా ఆల్టర్నేట్​ సోర్స్​ పాయింట్​ను నిర్దారించి అక్కడి నుంచి నీటిని తరలిస్తామని చైర్మన్ వెదిరె శ్రీరాం తెలిపారు. సమ్మక్క బ్యారేజీ ​నుంచి నీటిని మళ్లించే అంశం కూడా పరిశీలిస్తామన్నారు. రివర్ లింకింగ్​లో భాగంగా చత్తీస్​గఢ్ ఉపయోగించుకోని 141 టీఎంసీలను మాత్రమే మొదటి దశలో మళ్లిస్తామన్నారు. ఈ నీటిలో తెలంగాణ, ఏపీకి రెండు వంతులు, తమిళనాడు, కర్నాటకకు ఒక వంతు నీటిని కేటాయిస్తామన్నారు. రూ.43 వేల కోట్లతో ఈ రివర్ ​లింకింగ్​ చేపడతామని చెప్పారు.

మళ్లించే నీటిలో సగం వాటా.. 

తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వాటా పోను మిగులు జలాలు ఉంటే నదుల అనుసంధానంలో తరలించడానికి తమకేమి అభ్యంతరం లేదని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఏపీ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణకు కేటాయించిన నీళ్లను మినహాయించే రివర్ లింకింగ్​ చేపడుతున్నామని చైర్మన్ వెదిరె శ్రీరాం తెలిపారు. తెలంగాణ నుంచి నీటిని తరలిస్తుండటంతో ఇక్కడే ఎక్కువ భూమి సేకరించాల్సి ఉంటుందని, అందుకే రివర్ లింకింగ్​లో మళ్లించే నీటిలో సగం వాటా తమకే దక్కాలని రాష్ట్ర అధికారులు డిమాండ్​ చేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చైర్మన్ ​హామీ ఇచ్చారు. పోలవరం కుడి కాలువ నుంచే రివర్​ లింకింగ్​ చేపట్టాలన్న ఏపీ విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించి ఇచ్చంపల్లికి ఆల్టర్నేట్ ​సోర్స్ ​పాయింట్​ను ఫైనల్ చేద్దామని నిర్ణయించారు. మీటింగ్ తర్వాత వెదిరె శ్రీరాం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే నేషనల్​ఇంటర్ ​లింకింగ్​ఆఫ్​ రివర్​అథారిటీ (నీరా) ఏర్పాటు చేయబోతున్నామని, అది అమల్లోకి వచ్చాక ప్రతి రివర్ ​లింకింగ్ ​ప్రాజెక్టుకు ఒక అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు.