డేంజర్ లో ఢిల్లీ.. ముంచెత్తతున్న యమునా వరదలు.. ఢిల్లీ గల్లీలు మునిగిపోనున్నాయా ?

డేంజర్ లో ఢిల్లీ.. ముంచెత్తతున్న యమునా వరదలు.. ఢిల్లీ గల్లీలు మునిగిపోనున్నాయా ?

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు డేంజర్ లో ఉంది. యమునా నది.. ఢిల్లీని ముంచెత్తనుంది. ఈ మేరకు హై అలర్ట్ ప్రకటించింది కేజ్రీవాల్ సర్కార్. ఉన్నతాధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించి.. కేంద్రానికి సైతం లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ.. 2023, జులై 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ప్రజలను హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం.

ALSOREAD :హైదరాబాద్‌లో భారీ వర్షం....- మరో రెండు రోజులు అలర్ట్

డేంజర్ లెవల్లో యమునా నది ప్రవాహం :

ఢిల్లీ మీదుగా ప్రవహించే యమునా నది నీటి ప్రవాహం ప్రస్తుతం 207.55 మీటర్లుగా ఉంది. ఇది డేంజర్ లెవల్ అని ప్రకటించారు అధికారులు. 205.33 మీటర్ల స్థాయికి నీటి ప్రవాహం చేరితే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. అలాంటిది రెండు మీటర్లు అదనంగా నీటి ఉధృతి ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. 1978లో యమునా నది 207.49 మీటర్లు ప్రవహించింది. ఇప్పుడు ఆ స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో.. ఏ క్షణమైనా ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు పోటెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. 

హర్యానా నుంచి పోటెత్తుతున్న వరద :

ప్రస్తుతం యమునా నది డేంజర్ లెవల్లోనే ఉన్నా.. ప్రస్తుతానికి అయితే పెద్ద ముప్పు లేదు. ఎందుకంటే వర్షాలు పడటం లేదు. అయితే హర్యానా రాష్ట్రంలోని హత్నికుండు బ్యారేజ్ గేట్లు అన్నింటినీ ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. అంతే కాకుండా ఢిల్లీకి పైన ఉన్న ఉప నదులు, కాలువలు, వాగుల నుంచి పెద్ద ఎత్తున యమునా నదిలోకి నీళ్లు కలుస్తున్నాయి. ఈ నీళ్లన్నీ ఢిల్లీ ప్రాంతానికి వచ్చే సమయానికి.. మరో రెండు మీటర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటికి 209 మీటర్లుగా యమునా నది నీటి ప్రవాహం ఉంటుంది. ఇదే జరిగితే ఢిల్లీ వీధుధులు యమునా నది నీటితో మునిగిపోనున్నాయి. 

దీంతో అప్రమత్తం అయిన ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసింది. హర్యానా నుంచి నీటి విడుదలను ఆపాలని.. ఢిల్లీకి పైన ఉన్న డ్యాంల నుంచి నీటి ప్రవాహాన్ని కట్టడి చేయాలని లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్. యమునాలో నీటి ప్రవాహ ఉధృతి తగ్గిన తర్వాత.. ఆయా డ్యాముల్లోని నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్రం, జల వనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీకి ఉన్న వరద ముప్పుపై సమీక్ష చేస్తున్నారు. ఇదే సమయంలో యమునా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.