కన్న కొడుకును పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్

కన్న కొడుకును పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్

పాట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష్కరించారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. తన సొంత రాజకీయ పార్టీ నుంచే కాదు కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష్కరించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. 

అనుష్క యాదవ్ అనే యువతితో 12 ఏళ్ల నుంచి తాను రిలేషన్లో ఉన్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించిన 24 గంటల్లోనే ఆర్జేడీ నుంచి అతనిని లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించడం గమనార్హం. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు మరిచి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినందుకే పార్టీ నుంచి తొలగించినట్లు లాలూ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ చేస్తున్న పనులు, సమాజంతో అతను వ్యవహరిస్తున్న తీరు తమ కుటుంబ విలువలకు లోబడి లేవని, అందుకే.. అతనిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నానని లాలూ చెప్పుకొచ్చారు. తేజ్ ప్రతాప్ కు కుటుంబంతో, పార్టీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని ఆర్జేడీ అధినేత ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అనుష్క యాదవ్ అనే యువతిని తన ప్రేయసిగా పరిచేయం చేస్తూ చేసిన ఎఫ్బీ పోస్ట్ను తేజ్ ప్రతాప్ యాదవ్ డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఈ పోస్ట్ వైరల్ అయి తేజ్ ప్రతాప్ యాదవ్ సంబంధం గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. కొడుకు చేసిన ఈ ఊహించని ప్రకటనను భంగపాటుకు భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ అతనిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి వెలివేశారు.

ALSO READ | భర్తల ప్రాణాల కోసం పోరాడాల్సింది.. మీకు స్ఫూర్తి లేదు: పహల్గాం బాధిత మహిళలపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు