
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజ్యసభ ఎంపీ, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు బర్రెలు, గొర్రెలిచ్చి శాశ్వత బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని విమర్శించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. మొత్తం 129 బీసీ కులాలు ఉంటే ఇందులో 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యులు లేరని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. 545 మంది ఉన్న లోక్ సభ సభ్యులలో కేవలం 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పారు. కేంద్రం బడ్జెట్ లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం లేదన్నారు. ఐఐటి, ఐఐఎం కోర్సులు చదివే వారికి స్కాలర్ షిప్ లు, ఫీజులు రియింబర్స్ మెంట్ స్కీంలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.