
- యాక్సిడెంట్‌గా చిత్రీకరించి.. పరార్
- ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం
- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
దహెగాం, వెలుగు: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరు మృతిచెందగా, యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన ఆసిఫాబాద్జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్(38), పైల్స్‌తో బాధపడుతుండగా చికిత్స కోసం శనివారం అదే మండలంలోని గెర్రె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వినయ్సర్కార్ వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం అతడు ట్రీట్మెంట్ చేయగా, వైద్యం వికటించి శ్రీనివాస్ స్పృహ కోల్పోయాడు.
దీంతో పేషెంట్ ను కారులో తీసుకొని ఆర్ఎంపీ దహెగాం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గం మధ్యలో కారు అదుపుతప్పడంతో పంట పొలాల్లో దిగబడింది. ఆర్ఎంపీ వెంటనే అంబులెన్స్ కు కాల్చేయగా.. రాగానే పేషెంట్‌ను, కుటుంబ సభ్యులను అందులో ఎక్కించి అతను పరార్ అయ్యాడు. దహెగాం పీహెచ్‌సీకి వెళ్లగా బెల్లంపల్లికి రెఫర్చేశారు. అదే అంబులెన్స్‌లో అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
యాక్సిడెంట్‌గా చిత్రీకరణ
ఆర్ఎంపీ ఇంజక్షన్చేయగానే వికటించి వెంటనే చనిపోవడం తెలిసి హడావిడిగా కారులో ఆస్పత్రికి తరలించాలని చెప్పి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కారును కావాలనే పంటపొలాల్లోకి దించాడని, అనంతరం అంబులెన్స్‌లో ఎక్కించి ఆర్ఎంపీ పరారయ్యాడని ఆరోపించారు. ఆర్ఎంపీ వినయ్ సర్కార్ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్‌చేస్తూ బెల్లంపల్లి ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.