కల్వర్టును ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి.. జనగామ జిల్లా లింగాలఘనపూర్‌‌‌‌ మండలంలో ప్రమాదం

కల్వర్టును ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి.. జనగామ జిల్లా లింగాలఘనపూర్‌‌‌‌ మండలంలో ప్రమాదం
  • ఇద్దరు పిల్లలకు గాయాలు

రఘునాథపల్లి (లింగాలఘనపూర్), వెలుగు : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌‌‌‌ మండలంలోని వడిచర్ల గ్రామ శివారులో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

 ఏపీలోని నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దడ్డుజూ సురేశ్‌‌‌‌ (40) కరీంనగర్‌‌‌‌లోని ఓ గ్రానైట్‌‌‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య దివ్య (36), కుమారుడు లోక్షణ, కూతురు మోక్షనుజతో కలిసి ఇటీవల సొంత గ్రామానికి వెళ్లి.. బుధవారం కారులో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వడిచర్ల గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

 దీంతో సురేశ్‌‌‌‌తో పాటు అతడి భార్య దివ్య అక్కడికక్కడే చనిపోగా.. ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, గాయపడిన పిల్లలను హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.