
తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ( జులై 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న వినాయకస్వామి గుడి సమీపంలో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవ్వగా.. నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరుగు ప్రయాణంలో తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డవారు బెంగళూరుకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా గత నెలలో తిరుమల ఘాట్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. జూన్ 29న తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also Read:-చంద్రబాబు.. ఈసారి మా వాళ్లు నేను చెప్పినా వినరు
ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారు జీఎన్సీ టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు కారు దిగి పరుగులు తీసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.