
టెక్సస్(అమెరికా): ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన యువతి వంగవోలు దీప్తి టెక్సస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ నెల 12న స్నేహితురాలితో కలిసి వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతులు ఇద్దరినీ ఎమర్జెన్సీ టీమ్ ఆస్పత్రికి తరలించింది.
చికిత్స పొందుతూ దీప్తి ఈ నెల 15న చనిపోయిందని ఆమె స్నేహితురాళ్లు తెలిపారు. మరో నెల రోజుల్లో దీప్తి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోనుండగా ఈ ప్రమాదం జరగడంతో ఏపీలోని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. దీప్తి తెలివైన అమ్మాయని, ప్రతీ క్లాసులోనూ ఫస్ట్ వచ్చేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
భూమి అమ్మి దీప్తిని అమెరికాకు పంపించామని చెప్పారు. గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఇద్దరూ రావాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని దీప్తి కోరిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని స్నిగ్ధ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు.