చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన అదే హైవేపై RTC బస్సును ఢీకొన్న లారీ

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన అదే హైవేపై RTC బస్సును ఢీకొన్న లారీ

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి 19 మంది చనిపోయిన ఘటన జరిగిన బీజాపూర్-హైద్రాబాద్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది. బీజాపూర్-హైద్రాబాద్ హైవేపై శనివారం కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ RTC పల్లె వెలుగు బస్సును ఢీకొట్టిన ఘటనలో బస్సు ధ్వంసమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిన్నబండ తండా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులోని 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. RTC పల్లెవెలుగు బస్సు పరిగి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత బీజాపూర్ హైవేపై వరుస ఘటనలు:
హైదరాబాద్– బీజాపూర్ హైవేపై యాక్సిడెంట్లు ఆగడం లేదు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే.. తాజాగా జరిగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన వంశీధర్​రెడ్డి తన అత్తమ్మ సుజాత, మరో బంధువు రోజా,  డ్రైవర్​ వెంకట్తో కలిసి శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిమీద కారులో హైదరాబాద్ బయల్దేరాడు.

ఇదే సమయంలో హైదరాబాద్కు చెందిన కరీం(37), లోకేశ్​(24), బాబురావు, అఖిల్ మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి స్టేజీ సమీపంలోని గ్రీన్​ ఫీల్డ్ రిసార్ట్స్లో ఫొటో షూట్ కోసం కారులో వెళ్తున్నారు. 7:30 గంటల సమయంలో కనకమామిడి పరిధిలోని పెంటయ్య హోటల్​ వద్దకు రాగానే కరీం​కారు రాంగ్రూట్లోకి దూసుకెళ్లి వంశీధర్​రెడ్డి కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కరీం స్పాట్లోనే చనిపోగా.. మిగతా అందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మొయినాబాద్​ మున్సిపల్​ పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తరలించారు. లోకేశ్​ ఇక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. వంశీధర్ రెడ్డి డ్రైవర్ వెంకట్, బంధువుల్లో ఒకరికి సీరియస్గా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వంశీధర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్​ కుమార్​రెడ్డి తెలిపారు.

మరో ఘటనలో కారును ఢీకొన్న బస్సు..
బీజాపూర్ హైవేపైనే ఇంకో యాక్సిడెంట్ జరిగింది. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తోంది. దామరిగిద్ద గేటు సమీపంలోకి రాగానే డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఓవర్​ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కారును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.