‘రోల్ నెంబర్ 52’ షార్ట్ ఫిల్మ్ హర్ట్ టచింగ్.. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభపై డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసలు

‘రోల్ నెంబర్ 52’ షార్ట్ ఫిల్మ్ హర్ట్ టచింగ్.. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభపై డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసలు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)..‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను’ సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి చలనచిత్ర విద్య ద్వారా అందిస్తున్న దార్శనికతను ప్రశంసించారు.  అలాగే తెలంగాణ సృజనాత్మక వృద్ధికి నాయకత్వం వహించాలని నాగార్జునను భట్టి ఆహ్వానించారు. 

‘‘1970లలో ఈ ప్రాంతంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమా ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు.

అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ప్రపంచ స్థాయి చలనచిత్ర విద్య ద్వారా దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో నాగార్జున అక్కినేని మరియు అమల అక్కినేని నాయకత్వాన్ని భట్టి గుర్తించారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుండి వెలువడుతున్న అసాధారణ ప్రతిభ గురించి నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తన సందర్శనకు ప్రేరణనిచ్చిందని’’ డిప్యూటీ సీఎం భట్టి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ క్రమంలో "రోల్ నంబర్ 52" అనే షార్ట్ ఫిల్మ్పై భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. ‘‘ఈ చిత్రం హృదయాలను తాకింది. ఇటువంటి అర్ధవంతమైన ఫిల్మ్ అందించినందుకు రోల్ నంబర్ 52 డైరెక్టర్ని మరియు మొత్తం బృందాన్ని అభినందిస్తున్నాను. కొత్త ప్రతిభను పెంపొందించడానికి మరియు రాష్ట్రాన్ని చలనచిత్ర నిర్మాణం, మీడియా, ఆవిష్కరణ మరియు సృజనాత్మకతకు ప్రపంచ కేంద్రంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని” డిప్యూటీ సీఎం విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు.

ALSO READ : అప్పుడు ED.. ఇప్పుడు CID..

ఈ సందర్భంగా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఫౌండర్, హీరో అక్కినేని నాగార్జున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాకు స్వాగతం పలికినందుకు గౌరవంగా భావిస్తున్నాను!! మా విద్యార్థుల షార్ట్ ఫిల్మ్ మరియు దాని వెనుక ఉన్న ప్రతిభ పట్ల ఆయన ప్రశంసలు మాకు గొప్ప అనుభూతిని ఇచ్చాయి. ప్రపంచ స్థాయి చిత్రనిర్మాణం మరియు చలనచిత్ర విద్య కోసం నా తండ్రి ANR గారు దార్శనికతను అన్నపూర్ణ స్టూడియోస్ కొనసాగిస్తోంది. మన సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని నాగార్జున X వేదికగా తెలిపారు.

భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ స్కూల్ అంటే గుర్తొచ్చేది.. ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’. ఈ సంస్థను 2011లో  అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున స్థాపించారు. ప్రస్తుతం అక్కినేని అమల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.