అప్పుడు ED.. ఇప్పుడు CID.. బెట్టింగ్ యాప్ కేసుతో చిక్కుల్లో మంచు లక్ష్మి

అప్పుడు ED.. ఇప్పుడు CID.. బెట్టింగ్ యాప్ కేసుతో చిక్కుల్లో మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్ కేసులో CID విచారణకు మంచు లక్ష్మి శనివారం హాజరు కానున్నారు. మధ్యాహ్నం CID సిట్ ముందు ఆమె హాజరవుతారు. ఇప్పటికే ఈ కేసులో.. మంచు లక్ష్మి 2025 ఆగస్ట్లో ED విచారణ ఎదుర్కున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటి మంచులక్ష్మిని 'యో..లో 247' అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడంపై ఈడీ ప్రశ్నించింది. గత మూడేండ్ల బ్యాంక్ లావాదేవీల ఆధారంగా విచారణ చేసింది. ఆమె చెప్పిన వివరాలతో దాదాపు మూడు గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. మంచులక్ష్మి ప్రమోట్ చేసిన యాప్కు అను మతులు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది.

ప్రమోట్ చేసినందుకు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించించారు. బెట్టింగ్ యాప్ నుంచి మంచులక్ష్మి బ్యాంక్ అకౌంట్లలోకి జరిగిన లావాదేవీల గురించి ఆరా తీశారు. అగ్రిమెంట్ ప్రకారం పారితోషికం మాత్రమే వచ్చిందా లేక యాప్లో చేరిన సభ్యులకు అనుగుణంగా కమీషన్లు తీసుకున్నారా? అనే వివరాలతో ఆమె స్టేట్మెంట్ను ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసింది. కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలని ఆమెకు విచారణ సమయంలో ఈడీ సూచించింది.

యువతను ప్రలోభపెట్టే విధంగా బెట్టింగ్‌ యాప్స్‌‌ను ప్రమోట్ చేసిన బాలీవుడ్‌‌, టాలీవుడ్‌‌ నటులు విజయ్‌‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌‌రాజ్‌‌, మంచులక్ష్మి, నిధి అగర్వాల్‌‌, ప్రముఖ యాంకర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిపై  కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, మియాపూర్‌‌, సైబరాబాద్‌‌, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన వేర్వేరు ఎఫ్‌‌ఐఆర్‌‌ల ఆధారంగా ఈడీ.. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ కేస్‌‌ ఇన్‌‌ఫర్మేషన్‌‌ రిపోర్ట్‌‌(ఈసీఐఆర్‌‌‌‌) రిజిస్టర్ చేసింది.