కామారెడ్డి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నోడల్ , మండల స్థాయి అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, సమాచారం తదితర అంశాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమించారు.
ఓటర్ల జాబితా పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, కరెంట్, ర్యాంపుల వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈవో చందర్‌నాయక్, డీపీవో మురళి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల అనుభవం సమాజానికి అవసరం
కామారెడ్డిటౌన్: వయోవృద్ధుల అనుభవం సమాజానికి అవసరమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘మన ఆకాంక్షలు, మన శ్రేయస్సు, మన హక్కులు’ అనే థీమ్‌తో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
వయోవృద్ధులకు గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించటం ముఖ్యమన్నారు. సంఘ బిల్డింగ్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా వయోవృద్ధుల సంక్షేమ అధికారి ప్రమీల, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం.రాజన్న, తహసీల్దార్ జనార్దన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పున్న రాజేశ్వర్, నిట్టు విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
