
- హార్వెస్టర్ తగిలి బాలుడు..
మెదక్ (చేగుంట), వెలుగు: మేనమామ పెండ్లికొచ్చిన బాలుడు హార్వెస్టర్ కింద పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం శాలిపేటకు చెందిన మాలె హర్షిత్(6) తల్లిదండ్రులతో కలిసి మేనమామ పెండ్లికి చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి వెళ్లాడు. మూడు రోజుల కింద పెండ్లి వేడుకలు ముగియగా అక్కడే ఉన్నారు. ఆదివారం ఇంటి ముందు హార్వెస్టర్ రివర్స్ తీస్తుండగా వెనకాల ఉన్న హర్షిత్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పాట్ లో చనిపోయాడు. దీంతో ఇంట్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వెహికల్ ఢీకొని కార్మికుడు..
వెల్దుర్తి : హైవే మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కార్మికుడిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పాట్ లో చనిపోయాడు. మెదక్జిల్లా మాసాయిపేట మండలం బంగారమ్మ తల్లి ఆలయం శివారులో నేషనల్ హైవే – 44 మీద ఆదివారం ప్రమాదం జరిగింది. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, నిజామాబాద్ రూట్లో దాదాపు గంట పాటు వెహికల్స్ రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.